US: అమెరికా షట్ డౌన్ ఎఫెక్ట్… ఎయిర్ ట్రాఫిక్ అస్తవ్యస్తం..!
అమెరికా షట్ డౌన్ అయ్యి నెలరోజులు కావస్తోంది. ఇప్పటి వరకూ సమస్య పరిష్కారం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అటు అధికార రిపబ్లికన్లు, విపక్ష డెమొక్రాట్లు… తమ వాదనకే కట్టుబడి ఉండడం సమస్య తీవ్రతను మరింత జఠిలం చేస్తోంది. దీంతో ఈ షట్ డౌన్ ఎఫెక్ట్ .. నెమ్మదిగా అధికార యంత్రాంగాలపై చూపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ షట్ డౌన్.. అమెరికా ఎయిర్ పోర్టులపై పెను ప్రభావాన్నే చూపించింది.
అమెరికాలో కొనసాగుతున్న ప్రభుత్వ షట్‌డౌన్ .. ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లలో కీలక సిబ్బంది కొరత కారణంగా.. ఒక్కరోజే 4వేలకు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. మరో 118 విమాన సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. 27 రోజులుగా కొనసాగుతున్న ఈ షట్‌డౌన్‌తో పరిస్థితి నానాటికీ దిగజారుతోంది.
ఆదివారం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఫ్లైట్ అవేర్ డేటా ప్రకారం ఆదివారం సుమారు 8,700 విమానాలు ఆలస్యంగా నడిచాయి. దేశవ్యాప్తంగా సుమారు 13,000 మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, 50,000 మంది ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్ఏ) అధికారులు జీతాలు లేకుండానే విధులకు హాజరవుతున్నారు. దీంతో కార్యకలాపాలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.
సౌత్-ఈస్ట్ ప్రాంతంతో పాటు న్యూజెర్సీలోని నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిబ్బంది కొరత కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తెలిపింది. లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎఫ్ఏఏ గ్రౌండ్ డిలే విధించడంతో విమానాలు టార్మాక్‌పై సగటున 25 నిమిషాల పాటు నిలిచిపోయాయి.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ వివరించారు. “వారికి మంగళవారం జీతం రావడం లేదని గురు, శుక్రవారాల్లోనే నోటీసులు అందాయి. వారి పే-చెక్ సున్నాగా ఉండబోతోంది. నేను కొందరు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో మాట్లాడాను. వారిలో ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. చాలామంది నెల జీతంపైనే ఆధారపడి బతుకుతారు. కారులో గ్యాస్, పిల్లల బాగోగుల గురించి వారు ఆందోళన చెందుతున్నారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
షట్‌డౌన్ కొనసాగినంత కాలం విమానాల ఆలస్యం, రద్దులు తప్పవని రవాణా శాఖ హెచ్చరించింది. ప్రయాణికులు తమ విమాన స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని, ఎయిర్‌పోర్టులలో ఎక్కువ సేపు వేచి ఉండేందుకు సిద్ధపడాలని విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి. ఒకవేళ షట్‌డౌన్ ముగిసినా, పేరుకుపోయిన విమానాల రద్దీని క్లియర్ చేయడానికి చాలా సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.







