Rayapati Sailaja: రాయపాటి శైలజ నియామకంపై కూటమి మహిళా నేతల్లో అసంతృప్తి!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన తర్వాతే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఆ మధ్య కాలంలో మాత్రం కొద్ది పదవులు మాత్రమే నింపడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రాజకీయ శైలీకి అనుగుణంగానే ఇది కనిపిస్తోంది. ఆయన ఎప్పుడూ పదవుల పంపిణీ విషయంలో సమయాన్ని తీసుకోవడం, అనేక వర్గాల మధ్య సమన్వయం చేయడంలో జాగ్రత్తలు పాటించడం సహజం. అయితే, ఈసారి పదవులు ఆలస్యమవడంతో ఆశావహులు నెలల తరబడి ఎదురు చూశారు. కొందరికి పదవులు దక్కగా, చాలా మందికి నిరాశే మిగిలింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రాయపాటి శైలజ (Rayapati Shailaja) నియామకం కూటమిలో చర్చనీయాంశమైంది. ఆమె సామాజిక వర్గం నుంచి వచ్చిన నేత కావడంతో పాటు అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అందుకే కూటమి సర్కార్ ఆమెకు కేబినెట్ హోదా కలిగిన పదవి ఇచ్చింది. కానీ ఈ నిర్ణయం చుట్టూ కొత్త రాజకీయ తుపాను చెలరేగుతోంది. ఎందుకంటే కమిషన్‌లో ఇతర మహిళా సభ్యుల నియామకాన్ని ప్రభుత్వం ఇప్పటికీ చేపట్టలేదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress) పాలనలో ఉన్నప్పుడు, అప్పటి చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma)తో పాటు ఐదుగురు సభ్యులను నియమించడం ద్వారా మహిళా నాయకురాళ్లకు గుర్తింపు ఇచ్చింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే విధానాన్ని ఎందుకు అనుసరించడం లేదనే ప్రశ్న వేడెక్కుతోంది. టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP)ల్లో అనేక మంది మహిళా నేతలు ఉన్నప్పటికీ, వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తమవుతోంది.
ప్రత్యేకంగా ఎన్నికల సమయంలో కూటమి విజయంలో మహిళల పాత్ర అపారమని అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ ఇప్పటికీ వారిని పక్కనపెట్టడం సరిగా లేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. “కేవలం రాయపాటి శైలజ నియామకంతోనే మహిళా వర్గానికి న్యాయం జరిగిందని ఎలా చెప్పగలం?” అంటూ కొందరు మహిళా నేతలు ప్రశ్నిస్తున్నారు. మహిళా కమిషన్‌లో కనీసం ఐదుగురు సభ్యులను నియమిస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రతిస్పందన మరింత వేగవంతం అవుతుందని వారు అంటున్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకునే అవకాశం కూడా పెరుగుతుంది. కానీ ఈ అవకాశాన్ని ప్రభుత్వం వదిలేయడం కూటమి అంతర్గత అసంతృప్తిని పెంచుతోంది.
ఈ నేపథ్యంలో కూటమి నాయకత్వం భవిష్యత్తులో ఈ అసమానతను సరిచేస్తుందా? లేక రాజకీయ సమీకరణల దృష్ట్యా ఈ విధంగానే కొనసాగుతుందా? అనే చర్చ సాగుతోంది. పదవుల పంపిణీలో ఆలస్యం, అసమానతలతో మహిళా నేతల అసంతృప్తి స్పష్టంగా బయటపడుతోంది. చంద్రబాబు సర్కార్ ఈ విమర్శలకు ఎలా స్పందిస్తుందో చూడాలి.







