BJP Strategy: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ రాంగ్ స్ట్రాటజీ..!?
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills ByElection) ప్రచారం జోరందుకుంది. అన్ని ప్రధాన పార్టీలూ ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. కాంగ్రెస్ (Congress) తరపున సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా ఇవాల్టి నుంచి ప్రచార బరిలోకి దిగారు. ఇక బీఆర్ఎస్ (BRS) అయితే ప్రచారపర్వంలో దూసుకుపోతోంది. అభ్యర్థిని అందరికంటే ముందే ప్రకటించి క్షేత్రస్థాయిలో ప్రతిరోజూ ప్రచారం చేపడుతోంది. బీజేపీలో (BJP) మాత్రం ఆ స్పీడ్ కనిపించట్లేదు. అభ్యర్థిని కూడా ఆలస్యంగా ప్రకటించింది. చివరకూ ఆ పార్టీ ఎన్నికల వ్యూహం కూడా చాలా పేలవంగా ఉంది. జూబ్లీహిల్స్ లో పోటీ బీజేపీ, మజ్లిస్ (MIM) మధ్యే ఉంటుందని, మిగిలిన పార్టీలు నామమాత్రమేనని ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు (Ramachandra Rao) ప్రకటించారు. ఇక్కడే బీజేపీ దారుణంగా ఫెయిల్ అయినట్లు అర్థమవుతోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎంఐఎం అసలు పోటీలోనే లేదు. మజ్లిస్ పార్టీ అధినేత ఓవైసీ, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు బహిరంగంగానే ప్రకటించారు. అంతేకాదు, ఎంఐఎం నేతలు పలు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఇలాంటప్పుడు పోటీ బీజేపీకి, ఎంఐఎంకు మధ్య ఉంటుందని బీజేపీ చెప్పడం హాస్యాస్పదంగా కనిపిస్తోంది. బీజేపీ ఎప్పుడూ హిందుత్వాన్ని నమ్ముకుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఎంఐఎం ముస్లిం పార్టీ అనే విషయం తెలిసిందే. అది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుండడంతో దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉంది. గతంలో లాగే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కూడా అదే సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు అర్థమవుతోంది.
అయితే జూబ్లీహిల్స్ లో హిందూత్వ నినాదం వర్కవుట్ అవుతుందా.. లేదా అనేది బీజేపీ ఆలోచించినట్లు కనిపించట్లేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు పెద్దస్థాయిలో ఉన్నా, ఎప్పుడూ శాంతిభద్రతల సమస్య రాలేదు. అసలు హిందూ – ముస్లిం అనే భావన ఈ నియోజకవర్గంలో మొదటి నుంచీ కనిపించదు. ఇలాంటి నియోజకవర్గంలో కూడా బీజేపీ హిందూత్వ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకురావడమే ఆ పార్టీ వైఫల్యానికి నిదర్శనం. కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు ఇస్తోంది కాబట్టి, హిందూత్వను తెరపైకి తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ ఓట్లకు గండిపడుతుందనే ఆలోచన బీజేపీ చేస్తోంది.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇదే సిద్ధాంతంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రచారం చేసింది. అయినా హైదరాబాద్ పరిధిలో ఆ పార్టీ సక్సెస్ కాలేకపోయింది. ఒక్క అసెంబ్లీ సీటు కూడా ఆ పార్టీకి దక్కలేదు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ప్లాన్ వర్కవుట్ అయింది. అది కూడా హైదరాబాద్ లో ఉన్న రోహింగ్యాలను తరిమేస్తామని, భాగ్యనగరంగా పేరు మారుస్తామని సెంటిమెంటును రగల్చడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఆ తర్వాత ఎన్నికల్లో బీజేపీకి ఇది వర్కవుట్ కాలేదు. అంతెందుకు, అయోధ్య పట్టణం ఉన్న ఫైజాబాద్ స్థానంలోనే 2024 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. దీన్నిబట్టి ఈ హిందుత్వ నినాదం అన్ని సందర్భాల్లో వర్కవుట్ కాదని అర్థమైపోయింది. అయినా బీజేపీ మాత్రం దాన్నే నమ్ముకుంది. ఇది ఆ పార్టీకి ఏమాత్రం మేలు చేయకపోవచ్చు.







