Moscow: పుటోనియం ఒప్పందం రద్దు… ట్రంప్ కు పుతిన్ చెక్..!
ఉక్రెయిన్ యుద్ధం ఆపే విషయంలో ట్రంప్ సక్సెసవుతున్నారా.. లేక రష్యాను రెచ్చగొడుతున్నారా..? దశాబ్దాల క్రితం ప్లుటోనియం ఒప్పందం విషయంలో రష్యాను దారికి తెచ్చిన అమెరికా.. ఇప్పుడు అదే విషయంలో ఫెయిలవుతోందా…? కచ్చితంగా చెప్పాలంటే.. రష్యా తిరిగి స్వతంత్రంగా తన నిర్ణయం తీసుకుని.. ప్లుటోనియం ఒప్పందాన్ని రద్దు చేసుకునే అవకాశాన్నిచ్చిందా..? ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తోంది.
ఎలాగైనా ఉక్రెయిన్ వార్ ఆపాలన్న పట్టుదలతో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రష్యాపై విభిన్న రూపాల్లో ఒత్తిడి తెస్తున్నారు. ఓవైపు రష్యా ఆర్థిక వ్యవస్థను కట్టడి చేస్తూ, మరోవైపు.. ఉక్రెయిన్ కు వెపన్స్ అందిస్తున్నారు. దీంతో యుద్ధం ఎంతకూ తెగడం లేదు.అయితే.. లేటెస్టుగా రష్యా అధ్యక్షుడు పుతిన్.. ట్రంప్ కు గట్టి షాకిచ్చారు.అగ్రరాజ్యంతో ఉన్న ప్లుటోనియం ఒప్పందాన్ని రద్దు (Plutonium Deal) చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన చట్టంపై పుతిన్ తాజాగా సంతకం చేశారు. దీంతో మళ్లీ అణు టెన్షన్ మొదలైనట్లయ్యింది.
అమెరికా, రష్యా (US-Russia Plutonium Deal)ల మధ్య 2000 సంవత్సరంలో ది ప్లుటోనియం మేనేజ్మెంట్ అండ్ డిస్పొజిషన్ అగ్రిమెంట్ కుదిరింది. 2010లో దీన్ని సవరించారు. ఈ ఒప్పందం ప్రకారం.. ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత తమ వద్ద నిల్వ ఉన్న 34 మెట్రిక్ టన్నుల ప్లుటోనియంను అణ్వాయుధాల తయారీకి కాకుండా.. పౌర అణు విద్యుత్ కోసం వినియోగించేలా నిర్ణయించారు. ఈ ఒప్పందంతో దాదాపు 17 వేల అణ్వాయుధాల తయారుకాకుండా అడ్డుకున్నట్లు అవుతుందని అప్పట్లో అమెరికా అధికారులు అంచనా వేశారు.
అయితే, 2016లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సమయంలో అగ్రరాజ్యంతో రష్యా సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఒప్పందం అమలును పుతిన్ నిలిపివేశారు. తాజాగా ఈ అగ్రిమెంట్‌ను పూర్తిగా రద్దు చేసుకుంటూ చట్టంపై సంతకం చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ.. ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. దీంతో రష్యా మళ్లీ అణ్వాయుధ తయారీని వేగవంతం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.







