MD Yunus: భారత్ వ్యతిరేక ఉగ్రసర్పాలకు బంగ్లా స్థావరమవుతోందా..? మొహమ్మద్ యూనస్ సర్కార్ తీరుపై నిరసనలు..!
ఇండియా పక్కనే ఉన్న ఓ చిన్న దేశం.. తన అవసరాలకోసం ఇండియాపై ఆధారపడిన ఓ బుడ్డ దేశం..
భారత్ సైనిక ఆపరేషన్ తో స్వాతంత్రం సంపాదించుకున్న పొరుగుదేశం.. ఇప్పుడు దాయాది పాకిస్తాన్ (Pakistan) తో కలిసి కుట్రలు పన్నుతోంది. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదానికి పట్టుకొమ్మగా మారుతోంది. ఇప్పుడు పాక్ లో ఉన్న ఉగ్రవాద నేతలు.. పనిగట్టుకు మరి బంగ్లాదేశ్ లో వాలిపోతున్నారు. వారికి అక్కడ ఉన్న రాడికల్స్, ఉగ్రవాద పార్టీలు రెడ్ కార్పెట్ వేసి మరీ వెల్ కమ్ చెబుతున్నాయి. ఈపరిణామం ఇండియాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో కుట్రలు జరుగుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరీ ముఖ్యంగా షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత ఏర్పాటైన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్.. వరుసగా ఇండియా వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నారు.ఇక అవన్నీ పక్కన పెడితే… ఏకంగా ఇండియాలోని కొన్ని రాష్ట్రాలను తమ భూభాగంలో చూపిస్తూ, మ్యాప్ సైతం తయారు చేసేశారు. పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాకు వివాదాస్పద మ్యాప్‌ను అందజేశారు
బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ మొహమ్మద్ యూనస్ ఢాకా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాను కలిశారు. ఈ సమయంలో యూనస్ పాక్ జనరల్‌కు “ది ఆర్ట్ ఆఫ్ ట్రంప్ ” అనే పుస్తకాన్ని బహుకరించారు. దీని ముఖచిత్రంలో బంగ్లాదేశ్ వక్రీకరించిన మ్యాప్ ఉంది. ఈ మ్యాప్‌లో భారతదేశం ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ భూభాగంగా చిత్రీకరించి ఉన్నాయి. దీంతో కొత్త వివాదం తలెత్తింది. ఎందుకంటే ఈ చర్యలు గ్రేటర్ బంగ్లాదేశ్ కోసం రాడికల్ ఇస్లామిక్ గ్రూప్ డిమాండ్లకు అనుగుణంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
యూనస్ భారతదేశ ఈశాన్య ప్రాంతాన్ని బంగ్లాదేశ్ భూభాగంగా ప్రస్తావించడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్ని నెలలుగా యూనస్ విదేశీ వేదికలపై భారతదేశ ఈశాన్య రాష్ట్రాల గురించి పదే పదే ఇదే విధంగా ప్రస్తావించారు. ఇంతలో ఆయన జనరల్ మీర్జాను కలిసి వివాదాస్పద మ్యాప్ ఉన్న పుస్తకాన్ని ఆయనకు బహుకరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో భారతీయుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. భారత సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకున్నందుకు ఆయనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
యూనస్ తన తొలి చైనా పర్యటన సందర్భంగా మాట్లాడుతూ.. “భారతదేశంలోని ఏడు రాష్ట్రాలు, భారతదేశ తూర్పు భాగం… అవి భూపరివేష్టిత ప్రాంతం. ఈ ప్రాంతాలకు సముద్రంలోకి ప్రవేశం లేదు. ఈ ప్రాంతానికి సముద్ర రక్షకులం మేమే. ఇది అపారమైన అవకాశాలను తెరుస్తుంది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థను విస్తరించగలదు” అని యూనస్ చైనా అధికారులతో అన్నారు. ఈ ప్రకటనపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ట్రాన్స్షిప్మెంట్ ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్..
ఈ చర్యల తరువాత.. భారత్ గట్టిగానే చర్యలు తీసుకుంది. బంగ్లాదేశ్ వస్తువులు నేపాల్, భూటాన్, మయన్మార్లకు చేరుకోవడానికి భారత భూభాగం గుండా వెళ్ళడానికి అనుమతించే ట్రాన్స్షిప్మెంట్ ఒప్పందాన్ని తాజాగా భారతదేశం రద్దు చేసింది.







