ఆర్బీఐ కీలక నిర్ణయం…
బ్యాంకు వడ్డీ రేట్ల మార్పుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు శాతం రెపో రేటును వరుసగా ఏడోసారి కొనసాగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చితి, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత నడుమ కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వవలసిన అవసరం ఉందని తెలిపింది. 2021 -22 ఆర్థిక సంవత్సరంలో స్థూలా దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 9.5 శాతం ఉంటుందని అంచనా వేసింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వర్చువల్ సమావేశంలో బై మంత్లీ పాలసీ రేట్లను ప్రకటించారు. రెపో రేటును 4 శాతంగా, రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా కొనసాగించాలని ఆర్బీఐ మానెటరీ పాలసీ కమిటీ నిర్ణయించింది. ఈ కమిటీ మూడు రోజుల సమావేశాల అనంతరం ఈ నిర్ణయాలను ఆర్బీఐ ప్రకటించింది. 2020 మార్చి నుంచి రెపో రేటులో 115 బేసిస్ పాయింట్లను ఆర్బీఐ తగ్గించింది. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా విధించిన కఠినమైన ఆంక్షలు, ఆరోగ్య సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఈ నిర్ణయం తీసుకుంది.






