Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీలో కోవర్టులపై దృష్టి పెట్టిన రాహుల్..! మంచి రోజులు రాబోతున్నాయా..?

కాంగ్రెస్ పార్టీకి (Congress Party) సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న విషయం తెలిసిందే. దేశ స్వాతంత్ర్యోద్యమం ముందు నుంచే ఆ పార్టీ ఉంది. ఎంతోమంది మహామహులు ఆ పార్టీకోసం పని చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. వరుసగా మూడు సార్లు అధికారానికి దూరమైంది. కాంగ్రెస్ పార్టీని బీజేపీ (BJP) పూర్తిగా ఆక్రమించేసింది. దేశమంతటా సత్తా చాటుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారుతోంది. ఇందుకు ఆ పార్టీ నేతల వైఖరే కారణం అనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు అలాంటి నేతలపై పార్టీ నేత రాహుల్ గాంధీ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
గుజరాత్ (Gujarath) లో పర్యటించిన రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని కోవర్టులపై (Congress Party Coverts) దృష్టి పెట్టాలని, అలాంటి వాళ్లను ఏరేయాలని నేతలకు సూచించారు. పార్టీలో ఉంటూ బీజేపీకోసం పని చేస్తున్న నేతలు కొంతమంది ఉన్నారని, అలాంటి వాళ్ల వల్లే పార్టీ ఎదగలేకపోతోందనేది రాహుల్ గాంధీ అనుమానం. ఇది చాలా కాలం నుంచి వినిపిస్తున్న మాటే. ఒక్క గుజరాత్ లో మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నేతలు బీజేపీ కోసం పని చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి వాళ్లందరినీ తప్పించాలని గతంలోనే రాహుల్ గాంధీ చెప్పారు. కానీ ఆయన మాటకు సీనియర్లు అడ్డం తిరిగారు.
కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు రాహుల్ గాంధీ తీరును నిరసిస్తూ గతంలో గళమెత్తారు. వాళ్లలో గులాంనబీ ఆజాద్ లాంటి కొంతమంది ఆ తర్వాత పార్టీ నుంచి వెళ్లిపోయారు. వీళ్లంతా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇతరుల ప్రయోజనాలకోసం పాటుపడుతున్నారనేది రాహుల్ గాంధీ పసిగట్టారు. అందుకే అలాంటి వాళ్లందరినీ తప్పించాలని అప్పుడే వర్కింగ్ కమిటీ భేటీలో చెప్పారు. కానీ రాహుల్ గాంధీ యువకుడని, తెలియక మాట్లాడాతున్నారని ఆయనపైనే ఎదురుదాడి చేశారు. ఇంకో విధంగా చెప్పాలంటే రాహుల్ గాంధీని పప్పులా మార్చింది సొంత పార్టీ నేతలే. చేతకాని వాడనే ముద్రవేశారు.
కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ పరిణతి సాధించినట్లు కనిపిస్తోంది. నెమ్మెదిగా అలాంటి సీనియర్లను పక్కన పెడుతున్నారు. యువకులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలంగాణలో (Telangana) సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి (Revanth Reddy ) పగ్గాలివ్వడం ఈ కోవకే చెందుతుంది. ఇప్పుడు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ కేడర్ కు ఇలాంటి సంకేతాలే ఇస్తున్నారు. పార్టీని పట్టించుకోని నేతలను పక్కన పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. రాహుల్ గాంధీ నిర్ణయాలను యూత్ స్వాగతిస్తోంది. మరి సీనియర్లు ఇప్పటికైనే మారతారా.. పార్టీకోసం పని చేస్తారా అనేదాని పైనే పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో నేతల వైఖరి మారనంత వరకూ బీజేపీని ఎదుర్కోవడం కష్టమే అనే భావన వ్యక్తమవుతోంది.