Ahmedabad: పార్టీ ప్రక్షాళనపై రాహుల్ గురి..గుజరాత్ నేతలకు క్లాస్..

ఇండియా గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటములు తప్పడం లేదు. కాంగ్రెస్(Congress) పనై పోయిందంటూ దేశవ్యాప్తంగా విమర్శలు ఎక్కువయ్యాయి. ఆఖరుకు ప్రాంతీయ పార్టీలు సైతం.. తమ అస్థిత్వాన్ని నిరూపించుకుంటున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం పతనావస్థకు చేరుకుంటోంది. రాహుల్, ప్రియాంక గాందీ..పార్టీని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం రావడం లేదు. దీంతో పార్టీ ప్రక్షాళనే దీనికి మందని రాహుల్ బావిస్తున్నారు. దీనిలో భాగంగా పలు రాష్ట్రాల్లో నూతన ఒరవడిని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యంగా గుజరాత్(Gujarat) లో అయితే కాంగ్రెస్ అధికారం కోల్పోయి 30 ఏళ్లవుతోంది. అక్కడ అధికారం అందని ద్రాక్షగా మారుతోంది. అలా అని కాంగ్రెస్ కు ఆరాష్ట్రంలో ఓటు బ్యాంకు లేదా అంటే ఏకంగా 40 శాతం మేర ఉంది. కేవలం 5 శాతం ఓటు బ్యాంక్ పెంచుకుంటే చాలు అధికారంలోకి వచ్చే అవకాశముంటుంది. కానీ.. అలా జరగడం లేదు. ఎప్పుడు అధికారం గురించి మాట్లాడడమే తప్ప, పగ్గాలు మాత్రం చేతికి రావడం లేదు. ఈపరిణామంతో రాహుల్.. గుజరాత్ లో పార్టీ పటిష్టత గురించి మాట్లాడారు.
ఈ సమయంలో గుజరాత్ కాంగ్రెస్ లో కొందరు నేతల గురించి మాట్లాడారు రాహుల్. కొందరు నేతలు బీజేపీ కోసం పనిచేస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. అవసరమైతే 30-40 మంది నాయకులపై వేటు వేసేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టంచేశారు. కనీసం 5 శాతం ఓట్లు పెంచుకోగలిగితే రాష్ట్రంలో అధికారం మనదేనని చెప్పారు. రెండ్రోజుల గుజరాత్ పర్యటనలో చివరిరోజైన శనివారం అహ్మదాబాద్‌లో ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. ‘మనలో కొందరు నేతలు రహస్యంగా బీజేపీ కోసం పనిచేస్తున్నారు. వారెవరో మనం వడపోయాలి. లేకుంటే రాష్ట్ర ప్రజలు మనల్ని విశ్వసించరు’ అని చెప్పారు. ప్రజలు బీజేపీ వలలో చిక్కుకున్నారని అన్నారు. గత 20-25 ఏళ్ల బీజేపీ విజన్ విఫలమైందని.. కాంగ్రెస్ తేలికగా కొత్త విజన్ అందించగలదని తెలిపారు.
నాతో సహా అందరం రాష్ట్ర ప్రజల్లోకి వెళ్లాలి. వారు చెప్పేది వినాలి. వారు మన నుంచి ఏమాశిస్తున్నారు.. వారి విద్య, ఆరోగ్యం, భవిష్యత్ కోసం మనం ఏం చేస్తామో వారికి తెలియాలి’ అని చెప్పారు. ఐదు శాతం ఓట్లు పెంచుకోగలిగినా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో పార్టీ 22 శాతం ఓట్లు పెంచుకుందని.. అధికారంలోకి వచ్చిందని ప్రస్తావించారు. 2027లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 8-9 తేదీల్లో గుజరాత్‌లోనే ఏఐసీసీ ప్లీనరీ జరుగనుంది.