Purandheswari: బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి..!?

బీజేపీలో (BJP) సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొలిక్కి వస్తోంది. ఇప్పటికే 11 రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను (BJP State Presidents) నియమించింది. కనీసం 16 రాష్ట్రాల్లో కొత్త బీజేపీ అధ్యక్షులను నియమిస్తేనే జాతీయ అధ్యక్షుడిని (BJP National President) ఎన్నుకునేందుకు వీలుంటుంది. అందుకే ఈ నెలలోనే రాష్ట్రాల కొత్త అధ్యక్షుల ఎంపిక పూర్తవుతుందని భావిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు కూడా కొత్త అధ్యక్షులను నియమించే అవకాశం ఉందని సమాచారం. అయితే అనూహ్యాంగా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో ఎంపీ పురంధేశ్వరి (MP Purandheswari) పేరు ప్రముఖంగా ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇది ఆశ్చర్యం కలిగిస్తున్న అంశం.
బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవి అంటే ఆషామాషీ కాదు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అది గుర్తింపు పొందింది. అలాంటి పార్టీకి సారథ్యం వహించాలంటే కచ్చితంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలని చెప్పుకుంటూ ఉంటారు. పార్టీ సిద్ధాంతాలతో పాటు కలుపుగోలుతనం, వివిధ భాషలపై పట్టు.. లాంటివి కూడా చాలా అవసరం. అలాంటి నేతలనే సహజంగా బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తుంటారు. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న నడ్డా (JP Nadda) పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనివార్యమైంది. ఆ స్థానాన్ని భర్తీ చేయడంలో పురంధేశ్వరి ముందున్నారనే సమాచారం వినిపిస్తోంది.
బీజేపీ ఉత్తరాది పార్టీ అనే భావన దక్షిణాదిలో బలంగా ఉంది. అందుకే ఆ అపవాదును పోగొట్టుకోవాలనే ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉంది. అందుకే ఈసారి దక్షిణాది వాళ్లకు జాతీయ అధ్యక్ష హోదా ఇవ్వాలని ఆలోచిస్తోంది. అది కూడా ఒక మహిళకు ఇస్తే పాజిటివ్ సంకేతాలు వెళ్తాయని భావిస్తోంది. ఇలా ఆలోచించినప్పుడు ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి. ఒకరు పురందేశ్వరి కాగా రెండో వ్యక్తి ప్రస్తుత కోయంబత్తూరు ఎమ్మెల్యే వినతి శ్రీనివాసన్ (Vinathi Srinivasan). వినతి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పురంధేశ్వరి ఇప్పటికే రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. రెండు సార్లు కేంద్రంలో మంత్రిగా కూడా పని చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి పదేళ్లక్రితమే బీజేపీలో చేరడం పురంధేశ్వరికి మైనస్.
అయితే పార్టీ హైకమాండ్ పురంధేశ్వరి విషయంలో పాజిటివ్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ అనుమతికోసం అధిష్టానం సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఒకవేళ ఆరెఅస్ఎస్ అంగీకరిస్తే పురంధేశ్వరికి జాతీయ అధ్యక్షురాలి పీఠం దక్కే అవకాశం ఉంది. అదే జరిగితే ఆ పీఠాన్ని చేజిక్కించుకున్న వ్యక్తుల్లో పురంధేశ్వరి రెండో వారు అవుతారు. గతంలో వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) జాతీయ అధ్యక్షుడిగా పని చేశారు. ఒకవేళ పురంధేశ్వరికి ఇవ్వలేని పరిస్థితుల్లో కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay) లలో ఒకరికి ఆ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని కూడా సమాచారం. మొత్తానికి ఈసారి తెలుగు వాళ్లకు బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు దక్కుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.