ఈ-రూపీని ప్రారంభించిన ప్రధాని మోదీ
డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్ వోచర్ ఈ-రూపీ (e-RUPI) ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈరూపీ వోచర్‌ను రిలీజ్ చేశారు. డిజిటల్ లావాదేవీలు, నేరుగా నగదు బదిలీ విషయంలో దేశంలో ఈరూపీ కీలకపాత్ర పోషించనున్నట్లు మోదీ తెలిపారు. టార్గెట్ ప్రకారం చాలా పారదర్శకంగా ఎటువంటి లీకేజీ లేకుండా నగదును డెలివరీ చేయవచ్చు అని మోదీ అన్నారు. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో 21వ శతాబ్ధంలో ఇండియా ముందుకు వెళ్తున్న తీరుకు ఈ-రూపీని ఉదాహరణగా భావించవచ్చు అని ఆయన చెప్పారు. క్యూర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ రూపంలో ఈ వోచర్‌ను పంపిస్తారు. లబ్ధిదారుల మొబైల్‌కు ఆ వోచర్‌ను డెలివరీ చేస్తారు. దీని ద్వారా అ మౌంట్‌ను వాడుకోవచ్చు. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం 11 బ్యాంకులు ఈ-రూపీ సేవలను అందిస్తున్నాయి.






