Bombay High Court : బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఆ12 మంది నిర్దోషులే
రెండు దశాబ్దాల క్రితం ముంబయి (Mumbai) లో జరిగిన రైలు పేలుళ్లు ఘటనలో బాంబే హైకోర్టు (Bombay High Court) సంచలన తీర్పు వెలువరించింది. 2006లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసులో శిక్ష పడిన 12 మందిని తాజాగా నిర్దోషులుగా ప్రకటించింది. వారిపై ఉన్న అభియోగాలను నిర్ధరించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందున వారిని నిర్దోషులుగా తేల్చినట్లు తీర్పు వెలువరించింది. వీరిలో ఉరిశిక్ష పడిన ఖైదీలుగా కూడా ఉండటం గమనార్హం.
2006 జులై 11న ముంబయి పశ్చిమ రైల్వేలైన్‌లో పలు సబర్బన్ రైళ్ల (Suburban trains) లో వరుసగా బాంబు పేలుళ్లు (Bomb explosions) చోటుచేసుకుంది. యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసిన ఈ మారణ హోమం లో 189 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 800 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సుదీర్ఘ దర్యాప్తు అనంతరం 2015 అక్టోబరులో ప్రత్యేక కోర్టు 12 మంది నిందితులను దోషులుగా తేల్చింది. వీరిలో బాంబు అమర్చారన్న అభియోగాలపై ఐదుగురికి మరణశిక్ష, మిగతా ఏడుగురికి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. దోషుల్లో కమల్ అన్సారీ (Kamal Ansari) అనే వ్యక్తి 2021లో కొవిడ్ (Covid) కారణంగా నాగ్‌పూర్ జైల్లో మృతి చెందాడు.






