TTD Ghee : తిరుమల కల్తీ నెయ్యి కేసు.. ముగిసిన సిట్ విచారణ..
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుడు. ఆయన ప్రసాదమైన లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఈ ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక విచారణ బృందం (SIT) తమ విచారణను పూర్తి చేసింది. గత 15 నెలలుగా దేశవ్యాప్తంగా కొనసాగిన ఈ సుదీర్ఘ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే, సిట్ అధికారులు నేడు ఏసీబీ కోర్టులో కీలకమైన తొలి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసే అవకాశం ఉంది.
లడ్డు కల్తీ ఉదంతం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం సీరియస్ అయింది. ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేవలం ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే కాకుండా, నెయ్యి సరఫరా జరిగిన మూలాలను వెతకడానికి సిట్ బృందం 12 రాష్ట్రాల్లో పర్యటించింది. గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని డెయిరీ ప్లాంట్లు, నెయ్యి తయారీ కేంద్రాలు, రవాణా సంస్థల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. సుమారు 15 నెలల పాటు రాత్రింబవళ్లు శ్రమించి సిట్ అధికారులు పక్కా ఆధారాలను సేకరించారు.
ఈ మొత్తం కుంభకోణంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బోలేబాబా డెయిరీ పాత్ర అత్యంత కీలకమని సిట్ నిర్ధారణకు వచ్చింది. లడ్డు తయారీకి నాణ్యమైన ఆవు నెయ్యికి బదులుగా, జంతువుల కొవ్వు, తక్కువ నాణ్యత కలిగిన నూనెలు కలిపిన కల్తీ నెయ్యిని సరఫరా చేయడంలో ఈ డెయిరీ డైరెక్టర్లే ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు విచారణలో తేలింది. లాభార్జనే ధ్యేయంగా భక్తుల మనోభావాలను పక్కన పెట్టి, ప్రమాదకరమైన రీతిలో నెయ్యిని కల్తీ చేసినట్లు అధికారులు ఆధారాలతో సహా ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లు సమాచారం.
ఇవాళ దాఖలు చేయనున్న తొలి ఛార్జ్‌షీట్‌లో సిట్ మొత్తం 24 మందిని నిందితులుగా చేర్చినట్లు తెలుస్తోంది. ఇందులో బోలేబాబా డెయిరీకి చెందిన కీలక డైరెక్టర్లు, నెయ్యి నాణ్యతను పరీక్షించడంలో విఫలమైన లేదా సహకరించిన అప్పటి టీటీడీ విభాగాధిపతులు, టెండర్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లు, కల్తీ నెయ్యి సరఫరాకు సహకరించిన మధ్యవర్తులు ఉన్నారు. వీరందరిపైన ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, కల్తీ ఆహార పదార్థాల సరఫరా వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఇది కేవలం ప్రాథమిక ఛార్జ్‌షీట్ మాత్రమేనని, ఈ కేసులో లోతైన కుట్ర దాగి ఉందని సిట్ భావిస్తోంది. ఇప్పటికే గుర్తించిన 24 మంది కాకుండా, మరో 12 మందికి ఈ కుంభకోణంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు కోర్టుకు నివేదించనున్నారు. వీరిలో అప్పటి టీటీడీ బోర్డులో కీలక నిర్ణయాలు తీసుకున్న వ్యక్తులు, రాజకీయ పలుకుబడి ఉన్నవారు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వారిపై మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, తదుపరి విచారణలో వారి పేర్లను కూడా పొందుపరుస్తామని అధికారులు కోర్టుకు తెలపనున్నారు.
కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ఈ కేసులో సిట్ సమర్పించబోయే ఛార్జ్‌షీట్ అత్యంత కీలకం కానుంది. ప్రసాదం తయారీలో అక్రమాలకు పాల్పడి, పవిత్రతను భ్రష్టు పట్టించిన వారు ఎంతటి వారైనా శిక్షించాలని భక్తులు కోరుకుంటున్నారు. నేడు ఏసీబీ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలైన తర్వాత, ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందోనన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.






