Krishnam Raju: మధిరలో డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ 3వ వార్షిక హెల్త్ క్యాంప్
దిగ్గజ నటులు, మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి జయంతిని పురస్కరించుకుని ఉచిత మెగా డయాబెటిక్ ట్రీట్ మెంట్ క్యాంప్ ఈ నెల 20న ఖమ్మం జిల్లా మధిర దెందుకూరులోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్ లో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డిఫ్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు శ్రీమతి నందిని విక్రమార్క, మల్లు సూర్య విక్రమాదిత్య పాల్గొన్నారు. ఈ హెల్త్ క్యాంప్ ను కృష్ణంరాజు గారి సతీమణి శ్రీమతి శ్యామలా దేవి, ఆయన కూతురు ప్రసీద ఆధ్వర్యంలో ప్రముఖ డయాబెటిక్ ఫుట్ సర్జన్ డా. వేణు కవర్థపు సారథ్యంలో యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ వారు నిర్వహించారు. హెల్త్ క్యాంప్ లో ఖమ్మం, మధిర, పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 3 వేల మందికి పైగా ప్రజలు పాల్గొని..డయాబెటిక్, డయాబెటిక్ సంబంధ కాళ్ల సమస్యలకు ఉచితంగా పరీక్షలు, మందులు, చికిత్స తీసుకున్నారు.
ఈ హెల్త్ క్యాంప్ గురించి డిఫ్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ – మన అందరికీ ఇష్టమైన హీరో కృష్ణంరాజు గారి జ్ఞాపకార్థం, ఆయన జయంతి రోజున మధిరలో ఉచిత మెగా డయాబెటిక్ క్యాంప్ ను కృష్ణంరాజు గారి సతీమణి శ్యామలాదేవి గారు, ఆయన కూతురు ప్రసీద ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించారు. ఎంతోమంది పేద ప్రజలు తమకు డయాబెటిస్ ఉందని కూడా తెలియకుండా ఆ వ్యాధి ముదిరే వరకు చికిత్స తీసుకోవడం లేదు. కృష్ణంరాజు గారి కుటుంబ సభ్యులు పేద ప్రజల కోసం ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయం. కృష్ణంరాజు గారి సతీమణి శ్యామలా గారికి, ఆయన కూతురు ప్రసీద గారికి నా తరుపున కృతజ్ఞతలు చెబుతున్నాను. అన్నారు.
కృష్ణంరాజు గారి సతీమణి శ్రీమతి శ్యామలాదేవి గారు మాట్లాడుతూ – డయాబెటిక్ చికిత్స కోసం కృష్ణంరాజు గారు లండన్ వెళ్లినప్పుడు తనలా పేదలు వైద్యం చేయించుకోలేరు, వారి పరిస్థితి ఏంటని ఆలోచించారు. ఆ ఆలోచన నుంచి మొదలైందే ఈ ఫ్రీ డయాబెటిక్ హెల్త్ క్యాంప్. డా. వేణు గారితో కృష్ణంరాజు గారు మాట్లాడి ఏటా ఈ హెల్త్ క్యాంప్ నిర్వహణకు ఒప్పించారు. మొదటి హెల్త్ క్యాంప్ మొగల్తూరులో, రెండో ఏట భీమవరంలో నిర్వహించాం. ఈసారి మధిరలో మెగా డయాబెటిక్ హెల్త్ క్యాంప్ నిర్వహించాం. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం డిఫ్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క గారు పూర్తి సహకారం అందించారు. ఎంతోమంది పేద ప్రజలు ఈ హెల్త్ క్యాంప్ లో పాల్గొని వైద్య సహాయం పొందారు. ఇకపైనా ఈ హెల్త్ క్యాంప్ నిర్వహణను విజయవంతంగా కొనసాగిస్తాం. అన్నారు.
ప్రముఖ డయాబెటిక్ ఫుట్ సర్జన్ డా. వేణు కవర్థపు ఆధ్వర్యంలో యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ హెల్త్ క్యాంప్ లో మన దేశంతో పాటు వివిధ దేశాలకు చెందిన 32 మంది ప్రఖ్యాత వైద్యులు పాల్గొన్నారు.






