Vijaya Sai Reddy: జగన్ పై ప్రేమతో..కమలం తీర్ధం పుచ్చుకోనున్న సాయి రెడ్డి..?
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ఏర్పాటు చేసిన మీడియా సమావేశం పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పెంచుతోంది. ఆయన రాజకీయాలకు దూరమయ్యాను అంటూ గత ఏడాది ప్రకటన చేసి, ఈ ఏడాది మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను అంటూ ప్రకటించారు. దీనితో సాయి రెడ్డి ఏ పార్టీలో జాయిన్ కాబోతున్నారు అనే దానిపై పెద్ద చర్చ మొదలైంది. ఆయన ఈ మధ్య కాలంలో చేస్తున్న పోస్ట్ లు, తాజాగా ఆయన మాట్లాడిన మాటల ఆధారంగా చూస్తే.. విజయసాయి రెడ్డి, కమలం(BJP) తీర్ధం పుచ్చుకునే సంకేతాలే ఎక్కువగా ఉన్నాయి.
2014 నుంచి 2019 వరకు ఆయన.. జగన్(Ys Jagan) ను బిజెపికి దగ్గర చేసే క్రమంలో.. బిజెపి పెద్దలకు బాగా దగ్గరయ్యారు. ఏకంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో విజయసాయి రెడ్డిని, ప్రధాని మోడీ(Narendra Modi).. విజయ్ గారూ అని పిలిచే వరకు వెళ్ళింది. కేసుల విషయంలో జగన్ ను కాపాడుకోవడానికి విజయసాయి ఢిల్లీ స్థాయిలో చేసిన లాబీయింగ్ ఇప్పటికీ జగన్ కు రక్షణగా నిలిచింది అనే మాట వాస్తవం. వైసీపీ కంటే.. బిజెపిలోనే ఆయన బలంగా పట్టు పెంచుకున్నారు. ఇక ఇప్పుడు హిందుత్వ వాదం పేరుతో ఆయన సోషల్ మీడియాలో కాస్త హడావుడి చేస్తున్నారు.
తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై ఆయన ఎక్కడా విమర్శలు చేయలేదు. చంద్రబాబు నాయుడు తనను వేధిస్తున్నారు అనే గాని.. పాలనపై పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఇక కూటమి బలంగా ఉందని చెప్పే ప్రయత్నమే సాయి రెడ్డి చేసారు. దీనితో సాయి రెడ్డి.. కమలం పార్టీలో జాయిన్ కావడం లాంచనం అనే సంకేతాలు వస్తున్నాయి. ఆయన గనుక బిజెపి ఆఫీస్ లో కూర్చుంటే.. వైసీపీ 2029 లో అధికారంలోకి రావడం పెద్ద కష్టం కూడా కాదనే మాట సైతం వినపడుతోంది. జగన్ పై కూడా ఆయన విమర్శలు చేయలేదు. దీనితో.. జగన్ ను ప్రేమిస్తూనే, బిజెపితో ప్రయాణం చేసే సంకేతాలే కనపడుతున్నాయనే అభిప్రాయాలకు బలం చేకూరుతోంది.






