Anil Ravipudi: ఇండస్ట్రీ హిట్‌తో జోరుమీద అనిల్ రావిపూడి.. తదుపరి చిత్రం ఆ యంగ్ హీరోతోనే?
హైదరాబాద్: టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో ఆయన భారీ బ్లాక్ బస్టర్‌ను అందుకున్నారు. ఈ సినిమా ప్రాంతీయ చిత్రాల్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలవడమే కాకుండా, ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, రూ. 400 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంటోంది.
సస్పెన్స్‌లో నెక్స్ట్ ప్రాజెక్ట్: వరుస హిట్లతో ఉన్న అనిల్ రావిపూడి తన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నారనేది ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, అందుతున్న సమాచారం ప్రకారం.. ఆయన ఒక యంగ్ హీరోతో క్రేజీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం అనిల్ ఒక విభిన్నమైన టైటిల్‌ను కూడా అనుకున్నారట, అది ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడం ఖాయమని సమాచారం.
క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్: పవన్ కళ్యాణ్‌తో సినిమా ఇప్పట్లో ఉండదని, అలాగే వెంకటేష్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ కూడా ప్రస్తుతానికి లేదని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. హీరోల కాల్షీట్లను బట్టి తన కొత్త ప్రాజెక్ట్ ఉండబోతుందని ఆయన వెల్లడించారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సక్సెస్ సెలబ్రేషన్స్ పూర్తయ్యాక, తన కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒక యంగ్ హీరోతో అనిల్ రావిపూడి చేయబోయే ఈ ‘రిస్కీ’ ప్రయోగం ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






