Vijayasari Reddy : విజయసాయి రెడ్డి చెప్పింది నమ్మేద్దామా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న వైసిపి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఇటీవల ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే విచారణ అనంతరం ఆయన మీడియా ముందు మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం సమర్థనగా మాత్రమే కాకుండా, ఒక రాజకీయ నాయకుడి అవకాశవాదాన్ని, ద్వంద్వ వైఖరిని అద్దం పట్టేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
“లిక్కర్ స్కాంతో జగన్‌కు ఎటువంటి సంబంధం లేదు.. ఆయనకు తెలిసి ఉంటే ఇలాంటివి జరగనిచ్చేవారు కాదు” అని విజయసాయి రెడ్డి అనడం వినడానికి ఒక అమాయకపు వాదనలా అనిపించవచ్చు. కానీ, ఈ కుంభకోణంలో వినిపిస్తున్న పేర్లను ఒక్కసారి గమనిస్తే.. ఈ వాదన ఎంత డొల్లగా ఉందో అర్థమవుతుంది. మిథున్ రెడ్డి, రాజ్ కేసీ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప.. వీరంతా జగన్ మోహన్ రెడ్డి చుట్టూ తిరిగిన వ్యక్తులే.
ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత కీలకంగా వ్యవహరించి, పాలసీ నిర్ణయాలను ప్రభావితం చేసిన ఈ వ్యక్తులు, వేల కోట్ల రూపాయల వ్యవహారాన్ని ముఖ్యమంత్రికి తెలియకుండా నడిపించారంటే ఎవరూ అంత ఈజీగా నమ్మరు. పైగా జగన్ లాంటి అధినేత మాటను వాళ్లు జవదాటేవాళ్లు కారు. జగన్ తప్ప మిగిలిన వారందరూ దోషులే అని చెప్పడం ద్వారా, కేవలం బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ మొత్తం స్కామ్‌కు రాజ్ కేసీ రెడ్డే ప్రధాన బాధ్యుడని విజయసాయి రెడ్డి ఇప్పుడు ఆరోపిస్తున్నారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తుతోంది. రాజ్ కేసీ రెడ్డిని జగన్ కు పరిచయం చేసి, అతడిని సలహాదారు స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించింది విజయసాయి రెడ్డి కాదా? అనే విమర్శలు ఉన్నాయి. ఒక వ్యక్తిని వ్యవస్థలోకి తీసుకొచ్చి, ఇప్పుడు అంతా అతడే చేశాడు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? రాజ్ కేసీరెడ్డి చేస్తున్న తప్పులు ఆనాడే సాయిరెడ్డికి తెలిస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు? లేక ఇప్పుడు తనకు ముప్పు వస్తుందని తెలిసి అతడిపై నెట్టేసి బయటపడాలని చూస్తున్నారా?
లిక్కర్ స్కాంలో బాలాజీ గోవిందప్ప పేరు వినిపించడం ఈ కేసులో మరో కీలక మలుపు. ఆయన జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్ లో పనిచేసే వ్యక్తి. తన సొంత సంస్థలో పనిచేసే ఒక వ్యక్తి, రాష్ట్ర స్థాయి లిక్కర్ కుంభకోణంలో భాగస్వామిగా ఉంటే అది అధినేతకు తెలియదు అనడం పొసగని విషయం. ఇది కేవలం లాజిక్ మాత్రమే కాదు, రాజకీయ వాస్తవం కూడా.
జగన్ కు దాదాపు 14 ఏళ్ల పాటు నెంబర్ టుగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి, ఒక్కసారిగా పార్టీకి దూరం కావడానికి కారణం ఏంటో అందరికీ తెలిసిందే. తన ప్రాధాన్యత తగ్గిందనే అసంతృప్తి, తన స్థానాన్ని వేరే వాళ్లు ఆక్రమిస్తున్నారనే ఆగ్రహం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. నిజంగా జగన్ పై నమ్మకం ఉంటే, జగన్ కూడా ఆయన్ను నమ్మి ఉంటే బయటకు రావాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు కోటరీ అంటూ విమర్శలు చేయడం వెనుక తన అసంతృప్తి తప్ప నిజాయితీ లేదని స్పష్టమవుతోంది.
వైసీపీని వీడాక బీజేపీ అండతో రక్షణ పొందాలని ఆయన చూసినా, ఆయన మాటల మార్పు, అవకాశవాదం చూసి బీజేపీ అధిష్టానం కూడా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అందుకే వ్యవసాయం చేసుకుంటానని వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వస్తాననడం ఆయన అస్థిరతకు నిదర్శనం. గతంలో రామోజీరావుపై తీవ్ర విమర్శలు చేసి.. చానల్, పేపర్ పెడతానన్నారు. ఇప్పుడు వాటి ఊసే లేదు.
విజయసాయి రెడ్డి రాజకీయ ప్రయాణం అంతా ‘అవకాశం ఉన్నంత వరకు దగ్గరగా.. అవసరం తీరాక దూరంగా’ అన్నట్టుగానే సాగింది. లిక్కర్ స్కామ్ విషయంలో ఆయన జగన్ ను వెనకేసుకొస్తున్నారంటే అది నిజాల కోసం కాదు.. తన రాజకీయ రక్షణ కోసం, తన భవిష్యత్తు కోసం చేస్తున్న ప్రయత్నమే.






