Jagan: సంఖ్యల నమ్మకాలతో రాజకీయ ప్రయోగం..వైసీపీ పాదయాత్ర 2.0పై ఆసక్తికర చర్చ..
రాజకీయ రంగంలో ఉన్న నాయకులు, పార్టీలకు సెంటిమెంట్లు ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటాయి. ఏ రోజున ఎన్నికలు జరిగాయి, ఏ తేదీన ఫలితాలు వచ్చాయి, ఆ ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయా లేదా అన్నదానిపై చాలా మంది రాజకీయ నేతలు ప్రత్యేకమైన నమ్మకాలు పెంచుకుంటారు. అలాగే ఏ రోజున చేపట్టిన కార్యక్రమం విజయవంతమైందో, ఆ తేదీని మళ్లీ మళ్లీ ఉపయోగించాలనే భావన కూడా రాజకీయాల్లో కనిపిస్తుంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) విషయంలో కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని నంబర్లపై ఆ పార్టీకి ప్రత్యేకమైన నమ్మకం ఉందని రాజకీయ వర్గాల్లో మాట వినిపిస్తోంది. అందులో నాలుగు అనే సంఖ్య పార్టీకి కలిసి రాలేదని భావన ఉంది. పార్టీ ఏర్పడిన తర్వాత తొలిసారి పూర్తి స్థాయిలో పోటీ చేసిన 2014 ఎన్నికల్లో వైసీపీ (YCP) ఓటమిని ఎదుర్కొంది. అలాగే అధికారంలో ఉన్నప్పటికీ 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ రెండు సంవత్సరాల చివర కూడా నాలుగు ఉండటంతో, ఆ నంబర్‌ను అశుభ సూచకంగా కొందరు పార్టీ నేతలు భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇంకా 2024 ఎన్నికల్లో పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే రావడం కూడా మరో చర్చకు దారితీసింది. 2024లో డబుల్ ఫోర్ ఉందని, అది కూడా కలిసి రాలేదనే భావన పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. దీనికి భిన్నంగా ఏడు, తొమ్మిది సంఖ్యలపై మాత్రం వైసీపీకి నమ్మకం ఉందని అంటున్నారు. 2019లో తొలిసారి పార్టీ అధికారంలోకి రావడంతో తొమ్మిది అనే సంఖ్యపై ప్రత్యేకమైన అభిమానమే ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఆ నమ్మకంతోనే 2029లో మళ్లీ అధికారంలోకి వస్తామని పార్టీ నేతలు ధీమాగా మాట్లాడుతున్నారని సమాచారం. అలాగే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) చేపట్టిన మహా పాదయాత్ర (Maha Padayatra) 2017 నవంబర్ 6న ప్రారంభమైంది. ఆ తేదీకి సంబంధించిన సంఖ్యలను కలిపితే తొమ్మిది రావడం, చివర ఏడు ఉండటం కూడా సెంటిమెంట్‌కు బలంగా మారిందని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే 2027లో మరోసారి పాదయాత్ర చేపట్టాలనే ఆలోచనకు పార్టీ వచ్చిందనే ప్రచారం సాగుతోంది. ఏడో నంబర్ ఉండటం వల్లే ఆ ఏడాదిని ఎంపిక చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అంతేకాదు, ఏడవ నెల అయిన జూలై నుంచి యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా అంచనాలు వెలువడుతున్నాయి. తేదీల ఎంపికలో రోజు, నెల, సంవత్సరం కలిపి ఏడు లేదా తొమ్మిది వచ్చేలా చూసుకుంటారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా, గతంలో సార్వత్రిక ఎన్నికలకు సుమారు ఏడాదిన్నర ముందు చేపట్టిన పాదయాత్ర రాజకీయంగా లాభించింది. అదే వ్యూహాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. పాదయాత్ర తూర్పు నుంచా లేదా ఉత్తరం నుంచా మొదలవుతుందా అన్నదానిపైనా చర్చ సాగుతోంది. లక్కీ నంబర్లు, తిథులు, వాస్తు, దిక్కులు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈసారి పాదయాత్రకు రూపకల్పన చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి జగన్ పాదయాత్ర 2.0 రాజకీయంగా ఎంత ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.






