గతంలోనూ విడిపోయిన డీఎంకే కాంగ్రెస్.. మళ్లీ ఇప్పుడు
ఇండీ కూటమి చీలిపోయింది. ఈ కూటమికి డీఎంకే గుడ్ బై చెప్పేసింది. ఇక కాంగ్రెస్ తో తమ పొత్తు ముగిసినట్లేనని తేల్చి చెప్పింది. తమిళనాడులో విజయ్ కి కాంగ్రెస్ మద్దతివ్వడాన్ని డీఎంకే జీర్ణించుకోలేకపోయింది. అందుకే కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకుంటున్నామని ప్రకటించారు. అలాగే తమకు లోకసభలో ప్రత్యేక సీట్లు కేటాయించాలిన స్పీకర్ కి డీఎంకే ఎంపీ కనిమొళి ఏకంగా లేఖ కూడా రాశారు. తాము ఇప్పుడు పొత్తులో లేమని, పొత్తులో లేని పార్టీతో పక్క పక్కన కూర్చోవడం బాగోదన్నారు.
విజయ్ నేతృత్వంలోని టీవీకేకి కాంగ్రెస్ మద్దతివ్వడంపై డీఎంకే గుర్రుగా వుంది. తమకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడించిందని మండిపడింది. తన రాజకీయ స్వభావాన్ని కాంగ్రెస్ ఏమాత్రం మార్చుకోలేదన్నారు.
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో కలిసి ఉంది. దాదాపు 55 ఏళ్లుగా ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో మిత్రపక్షంగా కొనసాగుతున్నాయి. కానీ.. టీవీకేతో పొత్తుకు సిద్ధమైన నేపథ్యంలో డీఎంకేతో కాంగ్రెస్ పార్టీ తన బంధాన్ని తెంచుకున్నట్టు అయింది. 1969లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి కట్టాయి. తమిళనాట సెక్యులర్, డ్రవిడ రాజకీయ పార్టీల హవా దాదాపు అర్ధశాతాబ్దానికి పైగా సాగింది. అయితే, మధ్యలో కొన్ని సందర్భాల్లో ఇరు పక్షాలు విడిపోయినా.. 2003 నుంచి మాత్రం చెలిమి కొనసాగింది.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి విజయం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తమకు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలన్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌ను సీఎం స్టాలిన్ తిరస్కరించారు. అప్పటి నుంచే కాంగ్రెస్‌లో అసంతృప్తి మొదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు సైతం కాంగ్రెస్ ఇదేవిధమైన డిమాండ్‌ను స్టాలిన్‌ను ముదుంచింది. అధికారంలోకి వస్తే.. ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. అయితే.. ఈ ప్రతిపాదనను కూడా స్టాలిన్ తిరస్కరించారు. ఈ క్రమంలో విజయ్ నేతృత్వంలోని టీవీకేతో చేతులు కలిపేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది.






