Stalin-south: కేంద్రంపై దక్షిణాది దండయాత్రేనా…? తమిళనాడు అఖిలపక్షం కీలక నిర్ణయాలు

ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ పేరు చెబితేనే కాంగ్రెస్ తోపాటు ప్రాంతీయ పార్టీలకు వణుకుపుడుతున్న పరిస్థితి.. మొన్నటి దాకా సవాల్ చేసిన ఆప్ అధినేత కేజ్రీవాల్.. ఇప్పుడు ఓడిపోయి సైలెంటయ్యారు. ఇక పంజాబ్ లో ఆప్ సర్కార్ పరిస్థితి క్షణమొకయుగంలో గడుస్తోంది. ఈసమయంలో తమిళనాడుపైనా బీజేపీ ఫోకస్ పెంచింది. దీంతో మీకంటే ముందుగా మేమే యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ డీఎంకే.. ఎదురుదాడి ప్రారంభించింది. ఈ యుద్ధంలో ఇప్పటికే డీఎంకే ఆరితేరడంతో.. బీజేపీకి కష్టాలు తప్పేలా లేవు.
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశం(delimitation) రాజకీయంగా అగ్గిరాజేస్తోంది. తమిళనాడు వేదికగా మొదలైన రచ్చ.. ఇంకా కొనసాగుతూనే ఉంది.. అక్కడ అధికారంలో ఉన్న డిఎంకె అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటానికి సైరన్ మోగించింది. డీఎంకె పిలుపునిచ్చిన అఖిలపక్షానికి డీఎంకే ప్రధాన శత్రువైన ఏడీఎంకే, పార్టీని స్థాపించిన నాటి నుంచి డీఎంకే ని పదేపదే టార్గెట్ చేస్తున్న విజయ్ కు చెందిన టీవీకే(TVK) పార్టీ కూడా హాజరవడం కీలక పరిణామమని చెప్పవచ్చు..
నిన్న హిందీ వ్యతిరేక ఉద్యమం.. నేడు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశం.. విషయం ఏదైనా సరే ఆ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని కేంద్రాన్ని టార్గెట్ చేయడంలో తమిళనాడు ఎప్పుడు ముందుంటుంది.. తమిళనాడు సరే ఒక్కసారిగా ఉద్యమ రూపం దాల్చితే అందులో అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రజలు దాకా ఏకతాటిపైకి రావడం అనేది అనేక సందర్భాల్లో చూసిందే.. అది భాష ఉద్యమమైనా జల్లికట్టు పై నిషేధం విధించినా.. సుప్రీంకోర్టు తీర్పులను సైతం విభజించి పార్లమెంటులో ఆర్డినెన్స్ లు తెచ్చుకునేదాకా కలిసి పోరాటాలు చేసిన సందర్భాలు ఎన్నో చూసాం.. తాజాగా మరోసారి అలాంటి ఉద్యమమే జరగబోతోందా.. అంటే అవుననే వినిపిస్తోంది.
దేశవ్యాప్తంగా లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను తగ్గించి ఉత్తరాది రాష్ట్రాల్లో పెంచుకునే కుట్ర జరుగుతోందని స్టాలిన్ ఆరోపించారు. అదే జరిగితే తమిళనాడు 8 సీట్లు వరకు తగ్గి నిధులు రాజకీయ అవకాశాల రూపంలో తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ఆకోపించారు. కేంద్రంపై పోరాటం తప్పదని, ఆ పోరాటం అన్ని పార్టీలు కలిసి చేయాల్సిన అవసరం ఉందంటూ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
అన్ని పార్టీలు కలిసి వస్తేనే కేంద్రం మెడలు వంచగలమని స్టాలిన్ పిలుపునివ్వడంతో .. అఖిలపక్షం సమావేశానికి దాదాపు 52 పార్టీలు హాజరయ్యాయి. తమిళనాడు వందకు పైగా రాజకీయ పార్టీలు ఉండగా అందులో యాక్టివ్ గా ఉన్నవి 60 వరకు రాజకీయ పార్టీలుగా చెప్పొచ్చు. డీఎంకే నేతృత్వంలో జరిగిన అఖిల పక్షం సమావేశానికి ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు బద్ద శత్రువైన ప్రధాన ప్రత్యర్థులు ఏడీఎంకే నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యారు.. అలాగే పార్టీని స్థాపించినప్పటి నుంచి నటుడు విజయ్ టీవీ కె అధినేత పదేపదే డిఎంకే ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అలాంటి విజయ్ పార్టీ నుంచి కూడా ప్రతినిధి అఖిలపక్షం సమావేశానికి హాజరయ్యారు. మక్కల్ నీరుమయం అధ్యక్షుడు నటుడు కమలహాసన్ కూడా సమావేశానికి వచ్చారు. సమావేశంలో అన్ని పార్టీల ప్రతినిధులు కేంద్రం తీరును బిజెపి వ్యవహరిస్తున్న విధానాన్ని తప్పుపట్టారు. కాగా.. ఈ సమావేశానికి బిజెపి, నామ్ తమిళర్ కట్చి దూరంగా ఉన్నాయి..
అఖిలపక్షం కీలక తీర్మానాలు.
1971 జనాభా లెక్కల ప్రకారమే సీట్ల కేటాయింపు ఉండాలని సమావేశం తీర్మానించింది.తమిళనాడులోని ఎంపిలు, అఖిలపక్షం లోని పార్టీల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.దక్షిణాదిన ఉన్న అన్ని రాష్ట్రాల్లోమ్ పార్టీలను కలవాలని తీర్మానం జరిగింది..దక్షిణాది రాష్ట్రాల పార్టీలతో కలిసి ఉమ్మడి కార్యాచరణతో కేంద్రంపై పోరాటం చేయాలని నిర్ణయించింది..అంతే కాకుండా నియోజకవర్గాల పనర్విభజన జరజకూడదని డిమాండ్ చేశారు అఖిలపక్షంలోని ప్రతినిధులు. పునర్విభజన జరగడం లేదని మోడీ తో చెప్పించే లా పోరాడాలని సమావేశంలో తీర్మానం జరిగింది.
అఖిలపక్షం నిర్ణయించిన ప్రకారం కమిటీలో సభ్యులు ఎవరెవరు ఉండాలి అన్నది క్లారిటీ వచ్చాక వీలైనంత త్వరగా దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించి ముఖ్య పార్టీల అధినేతలతో చర్చించాలని నిర్ణయించారు.ఈ ఉద్యమానికి అందరి సహకారం కోరాలని ఒక తమిళనాడుకే కాకుండా దక్షిణాదిన ఉన్న రాష్ట్రాలకు కూడా అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని చర్చించి అందరితో కలిసి ఉద్యమించాలని అఖిలపక్షం కీలక నిర్ణయం తీసుకుంది.