Holi: హోళీ ఎప్పుడు? మార్చి3, లేక 4న?
మన హిందూ సంప్రదాయాల్లో ఒక్కో పండుగకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అలానే హోళీకి కూడా. ఇది సామాజికమైన పండుగ. అందరితో కలిసి రంగులు చల్లుకునే సరదా పండుగ. అటువంటి హోళీ గురించి ఇప్పటికే చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అలానే ఈ ఏడాది హోలీ మార్చి 3నా, 4నా జరుపుకోవాలా అనే విషయాల్ని తెలుసుకుందాం:
మార్చి 3నా? 4నా?
ఈ ఏడాది హోలికాదహనం మార్చి 2న వస్తుంది. మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. గ్రహణానికి 9 గంటల ముందే (ఉదయం 6:30 నుంచి) సూతకం ప్రారంభమవుతుంది. సూతక కాలంలో ఆలయాల్లో పూజలు నిలిపివేస్తారు. ఎలాంటి పండుగ వేడుకలు జరపకూడదు. ఈ గ్రహణం సాయంత్రం 6:48 వరకు కొనసాగుతుంది.
ఈ లెక్కన్న గ్రహణం సూతక ప్రభావం అనేది పూర్తిగా మార్చి 3 రాత్రితో ముగిసిపోతుంది. కాబట్టి, ఎటువంటి దోషం లేకుండా ఉన్న మార్చి 4, బుధవారం నాడు జరుపుకోవడం ఉత్తమం.
పురాణాల ప్రకారం… కామదహనం జరిగిన రోజున హోలీ వేడుకలు చేసుకున్నట్లు ఉంది. తెలుగువారు హోళీని కామదహనం అనీ, కాముడి పున్నమిగా పిలుస్తుంటారు. ఒకప్పుడు తారకాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. అతడు రుషులు, సత్పురుషులు, దేవతలు, ప్రజలను అనేక విధాలుగా పీడించడం మొదలుపెట్టాడు. తారకాసురుడు అమిత బలవంతుడు. పైగా శివుని సంతానం చేత తప్ప అతనికి మృత్యువు లేదన్న వరం ఒకటి పొందాడు.
ఇదిలా ఉంటే, శివుడు ఘోర తపస్సులో నిమగ్నమై ఉన్నాడు. పార్వతిదేవి పరమ శివుడిని వివాహాం చేసుకోవడం కోసం శివుని తపస్సుకు భంగం కలిగించాల్సిందిగా కామదేవుడ్ని సహాయం అడుగుతుంది. మరి శివసతి అయిన పార్వతి మీద అతడిలో మోహాన్ని కలిగించేందుకు స్వయంగా మన్మథుడే (కాముడు) పూనుకొన్నాడు. అప్పుడు కామదేవుడు ఆ తపస్సులో లీనమైన శివుడి ఏకాగ్రతను భంగం చేసేందుకు అతనిపై పూలబాణం వేస్తాడు. తన తపస్సుకు భంగం కలిగించింది ఎవరని ఆ పరమశివుడు తన త్రినేత్రంతో చూస్తాడు. అది కామదేవుడని గ్రహించి తన ముక్కంటిని తెరచి కామదేవుడి శరీరాన్ని వెంటనే భస్మం చేస్తాడు. అది తెలిసి కామదేవుని భార్య రతిదేవి పరమశివుడి వద్దకెళ్లి తన పతిని ఇవ్వమని వేడుకోగా తిరిగి కామదేవుడిని బతికిస్తాడు. శివుడు కామాన్ని దహించిన విధానానికి ప్రతీకగా కామదహనం పండుగ ఆనాటి నుంచి నేటికీ ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది. కాస్త లోతుగా పరిశీలిస్తే మనిషిలోని కోరికలను దహింపజేసి, మానసిక ఆరోగ్యాన్ని పెంపోందించుకోవాలనేదే ఈ పండగలోని ఆంతర్యం!
ఇవి కూడా చదవండి
నిజానికి ప్రతి మనిషిలో అంతర్లీనంగా దాగి ఉన్న అరిష్డ్వర్గాలైన రాగ, ద్వేష, కామ, క్రోధ, మధ, మోహ, మాయ లాంటి అంతర్గత గుణాలను బయటకు ప్రజ్వరిల్లకుండా నిత్యం అదుపు చేసుకుని తమ మనసుని స్వీయాధీనంలో పెట్టుకోవాలనే సందేశం మనకు గోచరిస్తుంది. మానవునిలో కోరికలు గుర్రంలా స్వారీ చేస్తే మనిషి భ్రష్టు పట్టిపోతాడు. కావున ఇటువంటి మాయ మోహలను వదిలి, సాత్విక గుణంతో జీవిస్తే.. జన్మకు సార్ధకత లభిస్తుందని ఈ పండుగ పరమార్థం.
ఇంకో కథ ప్రకారం, హిరణ్యకశపుడి చెల్లి అయిన హోలిక అనే రాక్షసి మరణించడం వల్ల ఆమె బాధల నుంచి శాశ్వత విముక్తి పొందినందుకు ప్రజలు సంతోషంగా రంగులు చల్లుకోవడం, తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ హోలిక మహోత్సవాన్ని జరుపుకున్నారు. ఆ హోలిక మహోత్సవం నాటినుంచి నేటివరకు కొనసాగుతూ వచ్చింది.
ఇక రాధాకృష్ణుల సంబంధంగా చెప్పుకొనే హోళీ కథ ఇంకాస్త సరదాగా ఉంటుంది. కృష్ణుడు నల్లనివాడు. అయితే తన చిన్నప్పుడు పూతన పాలు తాగడం వల్ల, కృష్ణుని మేని నీలమేఘపు వర్ణంలోకి మారిపోయిందంటారు. మరి రాధేమో కృష్ణునికంటే కాస్త ఛాయతో ఉండేది. ఈ విషయం పట్ల కృష్ణునికి కాస్త ఈర్ష్యగా ఉండేదట. ఓసారి తన తల్లి యశోద చెంతకు చేరి తన మనసులో విషయం చెప్పాడట కన్నయ్య. దాంతో యశోద ‘మీకు ఈ నలుపు తెలుపుల గొడవెందుకు, హాయిగా ఏ రంగులోకి కావాలంటే ఆ రంగులను పులుముకోండి’ అని సలహా ఇచ్చిందట.
యశోద అలా చెప్పడం ఆలస్యం.. చిలిపి కృష్ణుడు ఇలా రంగంలోకి దిగిపోయాడు. యశోదతో పాటుగా గోపికలదంరినీ రంగు నీళ్లలో ముంచెత్తాడు. ఇప్పటికీ కృష్ణలీలలతో ముడిపడి ఉన్న బృందావన్, మధుర, బరసానా వంటి పుణ్యక్షేత్రాల్లో హోలీని ఘనంగా జరుపుతారు. హోళీ రోజున రాధాకృష్ణులను ఊరేగించే వేడుకలను కూడా ఉత్తర భారతదేశంలో చూడవచ్చు. హోళీ తరువాత వచ్చే పంచమినాటి వరకూ ఈ సంబరాలు కొనసాగుతాయి.
కారణాలు ఏవైనా… రంగులతోనూ, మంటలతోనూ జరుపుకొనే మన హిందూ ముఖ్య పండుగల్లో ఒకటిగా హోలీ నిలిచిపోతుంది.

















