పిల్లల్లో చికెన్ పాక్స్.. నిర్లక్ష్యం చేస్తే అంతే!
Chickenpox: ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం చికెన్ పాక్స్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిర్మల్ జిల్లా కుబీరు మండలం పార్డి(కె) గ్రామంలో ఒకే కుటుంబంలో తల్లితో పాటు నెల వయసున్న చిన్నారికి కూడా ఈ లక్షణాలు కనిపించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
పిల్లలు, బాలింతలకు ఎక్కువగా ..
వేసవిలో శరీర ఉష్ణోగ్రతలు పెరగడం, చెమట పట్టడం , వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా వారి శ్వాస ద్వారా మరొకరికి చాలా వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, బాలింతలు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది.
లక్షణాలు..
మొదట తీవ్రమైన జ్వరం, అలసట, తలనొప్పి , ఒంటి నొప్పులు ఉంటాయి.
ఆ తర్వాత ముఖం, చేతులు, చాతి, వీపు భాగాల్లో ఎర్రటి మచ్చలు, బొబ్బలు ఏర్పడతాయి.
కొన్నిసార్లు విపరీతమైన దురద, మంట , నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. సొంత వైద్యం చేసుకోకుండా అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.
బాధితులను ప్రత్యేక గదిలో ఉంచాలి. వారు వాడే బట్టలు, పరుపులు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాప్తిని అరికట్టవచ్చు.
బాధితులు తగినంత నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవాలి. చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించాలి.
ప్రారంభ దశలోనే గుర్తిస్తే త్వరగా కోలుకోవచ్చని, నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి






