Boxing Day: అసలు బాక్సింగ్ డే అంటే ఏంటీ…?
“బాక్సింగ్ డే” ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుకి ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రతి ఏటా డిసెంబర్ 26న జరుపుకునే ఈ బాక్సింగ్ డే (Boxing Day) మన దేశంలో కంటే విదేశాల్లో బాగా పాపులర్. మన దేశంలో పండగలను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారో విదేశాల్లో బాక్సింగ్ డేని కూడా అదే రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే చాలామందికి అసలు బాక్సింగ్ డే అంటే ఏంటి అనేది క్లారిటీ లేదు. క్రిస్మస్ తర్వాత రోజున ఎందుకు బాక్సింగ్ డే జరుపుకుంటారు అనే దానిపై చాలామందికి సందేహాలు ఉన్నాయి.
అయితే క్రైస్తవులు పాటించే ఒక ఆచారమే బాక్సింగ్ డే. ఏసుక్రీస్తు జన్మదినం పురస్కరించుకొని… ఆ తర్వాత వచ్చే రోజుని బాక్సింగ్ డే గా జరుపుకుంటారు. డిసెంబర్ 26న నిరుపేదలకు అలాగే, సేవకులకు… బహుమతులు కానుకలు అందజేయడం అనేది ఈ బాక్సింగ్ డే ప్రధాన ఉద్దేశం. బాక్సింగ్ డే అనేది క్రిస్మస్ బాక్స్ అనే పదం నుంచి వాడుకులోకి వచ్చింది. ధనికులు, సంపన్నులు తమకు సేవ చేసే పని వారికి అలాగే నిరుపేదలకు క్రిస్మస్ బాక్సుల్లో పెట్టి గిఫ్ట్ లు అందిస్తూ ఉంటారు. ఆ తర్వాత వారు ఇచ్చిన బహుమతులను కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసేందుకు ఆ రోజున సెలవు ప్రకటించారు.
అదే రోజున బాక్సులు అన్నీ కూడా ఓపెన్ చేస్తారు. అలా క్రిస్మస్ తర్వాతి రోజున బాక్సింగ్ డే గా పాటిస్తారు. మొదటిసారి 19వ శతాబ్దంలో బ్రిటన్ లో క్వీన్ విక్టోరియా ఉన్నప్పుడు ఈ ఆచారాన్ని మొదలుపెట్టారు. అయితే ఈ బాక్సింగ్ డే కి సంబంధించి మరో సిద్ధాంతం కూడా వాడుకులో ఉంది. పేదల కోసం డబ్బు కానుకలు స్వీకరించేందుకు చర్చిలో ఉంచిన బాక్స్ ను క్రిస్మస్ తర్వాతి రోజు అంటే.. డిసెంబర్ 26న ఓపెన్ చేస్తారు. అందులోని బహుమతులను పేదలకు పంచి పెడుతూ ఉంటారు.
అలా బాక్సింగ్ డే గా పాపులర్ అయింది. బ్రిటన్, ఆస్ట్రేలియా(Australia), కెనడా, న్యూజిలాండ్ సహా అనేక కామన్వెల్త్ దేశాల్లో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. బాక్సింగ్ డేకు షాపింగ్ ఆఫర్లు కూడా విదేశాల్లో భారీగా ఇస్తూ ఉంటారు. ఇక క్రికెట్లో బాక్సింగ్ డే టెస్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతం మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా ఇండియా (India) జట్ల మధ్య నాలుగో టెస్ట్ జరుగుతుంది. ఇది 44వ బాక్సింగ్ డే టెస్ట్ కావడం విశేషం.






