DELHI: భారత్-ఈయూ ట్రేడ్ డీల్ తో ఎవరికెంత ప్రయోజనం..?
18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రపంచదేశాల దృష్టి కేంద్రీకృతమైంది. ఇంతకూ ఈ డీల్ వల్ల ఏయే వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఏయే వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఓసారి చూద్దాం..
భారీగా తగ్గనున్న లగ్జరీ కార్ల ధరలు
ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం లగ్జరీ కార్లపై దిగుమతి సుంకాల కోత. ప్రస్తుతం 110 శాతం వరకు ఉన్న దిగుమతి సుంకాన్ని ఏటా 2.5 లక్షల కార్ల కోటా పరిమితికి లోబడి, దశలవారీగా 10 శాతానికి తగ్గించనున్నారు. అయితే, ఈ ప్రయోజనం రిటైల్ ధర సుమారు రూ. 25 లక్షల కంటే ఎక్కువ ఉండే కార్లకు మాత్రమే వర్తిస్తుంది.
దేశీయ ఆటోమొబైల్ తయారీదారులను రక్షించేందుకు, తక్కువ ధర కలిగిన కార్లను ఈ ఒప్పందం పరిధి నుంచి మినహాయించారు. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, పోర్షే వంటి యూరప్ లగ్జరీ కార్ బ్రాండ్లకు ఈ ఒప్పందం ఎంతో ప్రయోజనకరం కానుంది. ఈ సుంకాల కోత సుమారు ఐదేళ్లలో దశలవారీగా అమలవుతుంది.
చౌకగా మద్యం, ఆహార పదార్థాలు
కార్లతో పాటు మద్యం ప్రియులకు కూడా ఈ ఒప్పందం తీపికబురు అందించింది. ప్రీమియం యూరోపియన్ వైన్లపై దిగుమతి సుంకాన్ని 150 శాతం నుంచి 20-30 శాతానికి తగ్గించనున్నారు. విస్కీ వంటి స్పిరిట్స్ పై సుంకాన్ని 40 శాతానికి, బీర్లపై సుంకాన్ని 50 శాతానికి పరిమితం చేయనున్నారు.
వీటితో పాటు ఆలివ్ ఆయిల్, మార్జరిన్ వంటి వంట నూనెలపై సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయనున్నారు. చాక్లెట్లు, బిస్కెట్లు, పాస్తా, బ్రెడ్ వంటి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలపై ప్రస్తుతం ఉన్న 50-55 శాతం సుంకాన్ని పూర్తిగా తొలగించనున్నారు. దీంతో యూరప్ నుంచి వచ్చే అనేక ప్యాకేజ్డ్ ఫుడ్స్ ధరలు సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి.
ఆరోగ్య రంగంలోనూ ఊరట
ఆరోగ్య రంగంలోనూ ఈ ఒప్పందం సానుకూల ప్రభావం చూపనుంది. యూరప్ నుంచి దిగుమతి అయ్యే అనేక ఫార్మా ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న 11% సుంకాన్ని దాదాపుగా సున్నాకు తగ్గించనున్నారు. దీంతో పాటు, సుమారు 90 శాతం ఆప్టికల్, మెడికల్, సర్జికల్ పరికరాలపై సుంకాన్ని పూర్తిగా రద్దు చేయనున్నారు. ఇది దేశంలో వైద్య పరికరాల ధరలను తగ్గించి, ఆధునిక చికిత్సలను మరింత అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
దశలవారీగా అమలు
ఇరు పక్షాల ఆమోద ప్రక్రియలు పూర్తయ్యాక 2027 నుంచి ఇది అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. అయితే, ఈ సుంకాల తగ్గింపు ఒక్కసారిగా కాకుండా 3, 5, 7 ఏళ్ల వ్యవధిలో దశలవారీగా జరుగుతుంది. అంతేకాకుండా, దిగుమతి సుంకాలు తగ్గినా.. తుది రిటైల్ ధరలు జీఎస్టీ, రవాణా ఛార్జీలు, విదేశీ మారకపు రేట్లు, కంపెనీల ధరల నిర్ణయాలపై కూడా ఆధారపడి ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.






