Plane Crash : విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం!
మహారాష్ట్ర రాజకీయ యవనికపై ఒక శకం ముగిసింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత అజిత్ పవార్ (66) బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ఈ విషాదకర ఘటన పూణే జిల్లాలోని బారామతి ఎయిర్పోర్ట్ సమీపంలో చోటుచేసుకుంది. అజిత్ పవార్‌తో పాటు విమానంలో ఉన్న మరో ఐదుగురు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.
బుధవారం ఉదయం సుమారు 8:00 గంటలకు అజిత్ పవార్ తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బారామతికి బయలుదేరారు. బారామతిలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభలో ఆయన పాల్గొనాల్సి ఉంది. విమానం గమ్యస్థానానికి చేరుకోవడానికి కొద్ది నిమిషాల ముందు, ఉదయం 9:00 గంటల సమయంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం. పైలట్ విమానాన్ని బారామతి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేసే సమయంలో ప్రమాదం సంభవించింది. విమానాశ్రయానికి సమీపంలోనే అదుపుతప్పి భూమిని బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే విమానంలో మంటలు చెలరేగి, క్షణాల్లోనే శకలాలుగా మారిపోయింది.
విమానం శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలం నుంచి దట్టమైన పొగ, మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం, విపత్తు నిర్వహణ బృందాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. దురదృష్టవశాత్తు, విమానంలో ఉన్నవారెవరూ ప్రాణాలతో బయటపడలేదని సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు వెల్లడించారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ ఒక అజేయ శక్తి. అజిత్ పవార్ ను అందరూ ‘దాదా’ అని పిలుచుకుంటూ ఉంటారు. తనదైన పరిపాలనా శైలితో, కఠిన నిర్ణయాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా, పలుమార్లు ఉప ముఖ్యమంత్రిగా ఆయన సేవలందించారు. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్ర, బారామతి నియోజకవర్గాలను అభివృద్ధి పథంలో నడిపించడంలో ఆయన కృషి అనన్యం. ఎన్సీపీలో చీలిక తర్వాత పార్టీని తన చేతుల్లోకి తీసుకుని, అధికార పక్షంలో కీలక భూమిక పోషించారు.
అజిత్ పవార్ మృతి వార్త తెలియగానే మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “అజిత్ పవార్ మరణం మహారాష్ట్రకు తీరని లోటు. ఒక సమర్థవంతమైన పరిపాలనా దక్షుడిని రాష్ట్రం కోల్పోయింది” అని ప్రముఖులు తమ సంతాప సందేశాల్లో పేర్కొంటున్నారు.
ఈ ప్రమాదానికి గల కారణాలపై విమానయాన శాఖ (DGCA) ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. వాతావరణం అనుకూలించకపోవడమా లేక విమానంలో ఏదైనా అంతర్గత సాంకేతిక లోపం ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు, ప్రమాదానికి ముందు పైలట్ ఏటీసీ (ATC) తో జరిపిన సంభాషణలను విశ్లేషిస్తున్నారు.






