Amaravathi: పనితీరే గీటురాయి.. పదవులు ఊడతాయని చంద్రబాబు వార్నింగ్..!
టీడీపీ అధినేత చంద్రబాబు.. గతానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారా..? గతంలో నేతలు , కార్యకర్తలకు హితబోధలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఏకంగా వార్నింగులిస్తున్నారు. పనిచేస్తారా…? పక్కకు పోతారా తేల్చుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పుడీ పరిణామం.. టీడీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సీనియర్లు సైతం.. ఇది మంచి పరిణామమంటూనే, తమజాగ్రత్తలో తాముంటున్నట్లు సమాచారం.
పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. ఏ నాయకుడైనా సరే నిర్లక్ష్యం వహించినా, వివాదాలు సృష్టించినా పక్కనబెట్టడానికి వెనుకాడబోనని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అధికారం వచ్చిందన్న భావనతో ఎవరూ అలసత్వం ప్రదర్శించవద్దని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని స్పష్టం చేశారు.
“పార్టీలో పదవులు పొందిన వారి పనితీరును ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తాను. సరిగా పనిచేయకపోతే వారిని తప్పించి, మరొకరికి అవకాశం కల్పిస్తాను. పార్టీలో తీసుకొస్తున్న మార్పులకు అనుగుణంగా నేతలు, కార్యకర్తల్లో కూడా మార్పు రావాలి. వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
కార్యకర్తే అధినేత..
పార్టీలో కార్యకర్తే అధినేత అని, వారికి న్యాయం జరిగినప్పుడే పార్టీ శాశ్వతంగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారని, పసుపు జెండా కోసం రక్తం చిందించారని గుర్తుచేశారు. “ఏ పని జరిగినా కార్యకర్తలకు గుర్తింపు ఉండాలి. నాయకులెవరూ కేడర్‌ను విస్మరించవద్దు. వారితో నిరంతరం అనుసంధానమై ఉండాలి” అని ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించారు.
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చంద్రబాబు కేడర్‌కు పిలుపునిచ్చారు. “మనం చేసే పనులు ఎంత ముఖ్యమో, మనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం కూడా అంతే ముఖ్యం. సోషల్ మీడియాలోనే కాదు, మౌత్ టు మౌత్ పబ్లిసిటీతో ప్రజలకు వాస్తవాలు వివరించాలి,” అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.






