Skin Tags: పులిపిర్లతో ఇబ్బంది పడుతున్నారా? ఈ సింపుల్ ఇంటి చిట్కాలతో వాటికి చెక్ పెట్టండి!
హైదరాబాద్: చర్మంపై బుడిపెల్లా కనిపించే పులిపిర్లు (Skin Tags) ప్రాణాంతకమైనవి కావు కానీ, చూడటానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. ముఖ్యంగా మెడ, చంకలు లేదా కనురెప్పల వంటి సున్నితమైన భాగాలపై ఇవి ఏర్పడినప్పుడు, మనం వేసుకునే దుస్తులు లేదా ఆభరణాలు తగిలి మంట, నొప్పి వచ్చే అవకాశం ఉంది. చాలా మంది వీటిని వదిలించుకోవడానికి సర్జరీలే మార్గం అనుకుంటారు, కానీ అసలు ఇవి ఎందుకు పుట్టుకొస్తాయో తెలుసుకుంటే, ఇంట్లోనే వీటిని సులభంగా నివారించవచ్చు.
పులిపిర్లు ఎందుకు ఏర్పడతాయి?
చర్మం లోపల కొల్లాజెన్, రక్తనాళాల కణజాలం ఒకచోట పేరుకుపోవడం వల్ల ఇవి చిన్న చిన్న బుడిపెల్లా పెరుగుతాయి. కేవలం చర్మం ఒకదానికొకటి రాసుకోవడమే కాకుండా.. అధిక బరువు, మధుమేహం (Diabetes), థైరాయిడ్ సమస్యలు లేదా హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారిలో ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
సహజంగా తొలగించుకునే ఇంటి చిట్కాలు:
టీ ట్రీ ఆయిల్: ఇందులో శక్తివంతమైన యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. పులిపిరి ఉన్న చోట కొద్దిగా టీ ట్రీ ఆయిల్ రాసి బ్యాండేజ్ వేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే పులిపిరి ఎండిపోయి వాటంతట అదే రాలిపోతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్: ఒక దూదిని యాపిల్ సైడర్ వెనిగర్‌లో ముంచి పులిపిరిపై ఉంచి కట్టు కట్టాలి. దీనిలోని ఆమ్ల గుణం ఆ కణజాలాన్ని విచ్ఛిన్నం చేసి పులిపిరిని సులభంగా తొలగిస్తుంది.
అరటి పండు తొక్క: పండు తిన్నాక తొక్కను పారేయకుండా, దాని లోపలి భాగాన్ని పులిపిరిపై ఉంచి కట్టు కట్టాలి. అరటి తొక్కలోని ఎంజైమ్స్ పులిపిర్లను వదిలించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
వెల్లుల్లి పేస్ట్: వెల్లుల్లికి చర్మ సమస్యలను తగ్గించే గుణం ఉంది. వెల్లుల్లి రెబ్బలను దంచి పేస్ట్‌లా చేసి పులిపిరిపై రాసి రాత్రంతా ఉంచితే కొద్ది రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.
విటమిన్ ఇ ఆయిల్: మార్కెట్లో దొరికే విటమిన్ ఇ క్యాప్సూల్స్‌లోని ద్రవాన్ని రోజూ పులిపిర్లపై రాస్తుంటే అవి మెల్లగా మాయమవుతాయి.
జాగ్రత్త: కంటి రెప్పలపై లేదా అత్యంత సున్నితమైన భాగాలపై పులిపిర్లు ఉంటే మాత్రం ఇంటి చిట్కాలు ప్రయత్నించకూడదు. అలాంటి సమయాల్లో చర్మ వైద్య నిపుణుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడమే సురక్షితం.






