DELHI:భారత్-ఈయూ డీల్ కు ఎందుకంత ప్రాధాన్యం..?
ప్రపంచంపై ట్రంప్ టారిఫ్‌ల దాడి తరుణంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది భారత్-యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్. ప్రపంచ జీడీపీలో దాదాపు నాలుగోవంతుకు సమానమైన ఈ ‘మదర్ ఆఫ్ ఆల్’ డీల్ ముఖ్యంగా అమెరికాకు అసహనం కలిగిస్తోంది. దీనిపై ఇప్పటికే అమెరికా ఆర్థికమంత్రి బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు కూడ. ఇంతకూ ఈ ఒప్పందం భారత్-ఈయూలకు ఎందుకంత ప్రత్యేకం..?
భారత్-ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (FTA) 2007లోనే చర్చలు మొదలయ్యాయి. అయితే, ఆటోమొబైల్స్, వైన్‌పై దిగుమతి సుంకాలు, ఫార్మాస్యూటికల్స్ వంటి అంశాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మధ్యలో నిలిచిపోయిన చర్చలు.. 2022లో తిరిగి ప్రారంభమయ్యాయి. గతేడాది ప్రపంచ దేశాలపై ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఈ ఎఫ్‌టీఏ కోసం వేగంగా అడుగులు పడ్డాయి. ఈ ఒప్పందంతో దాదాపు 90శాతం భారత ఉత్పత్తులకు యూరోపియన్ మార్కెట్లో సుంకాలు ఉండవని సమాచారం. ముఖ్యంగా జౌళి, లెదర్, కెమికల్స్, ఆభరణాల రంగాలకు ఈ డీల్ ఊతమివ్వనుంది. భారత్‌కు యూరోపియన్ సమాఖ్య అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2023-24లో ఈ రెండింటి మధ్య దాదాపు 135 బిలియన్ డాలర్ల వర్తకం జరిగింది. ఈ రెండు పక్షాల మధ్య ఎఫ్‌టీఏ- దాదాపు 200 కోట్ల మందికి ఉమ్మడి మార్కెట్‌ను సృష్టిస్తుంది.
ట్రంప్ టారిఫ్‌లకు కౌంటర్..
భారత్- ఈయూ ట్రేడ్ డీల్‌ను ట్రంప్ టారిఫ్‌లకు వ్యూహాత్మక కౌంటర్‌గా చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు. గతేడాది ఆగస్టులో భారత్‌పై ట్రంప్ 25శాతం టారిఫ్‌లు విధించారు. ఇక, రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంగా అదనపు పెనాల్టీలు వేయడంతో సుంకాల మొత్తం 50శాతానికి చేరింది. అటు ఈయూ విషయానికొస్తే.. ఉక్కు, అల్యూమినియంపై 25శాతం టారిఫ్‌లు వేశారు. ఆ తర్వాత ఆ సుంకాలను 15 శాతానికి తగ్గిస్తూ అమెరికా, ఈయూ ఓ ట్రేడ్ ఫ్రేమ్‌వర్క్‌ను ఆమోదించుకున్నాయి.
ఇటీవల గ్రీన్లాండ్ వ్యవహారంలో ఈయూ సమాఖ్యతో ట్రంప్ సంబంధాలు బెడిసికొట్టాయి. గ్రీన్లాండ్కు సహకరించే యూరోపియన్ దేశాలపై టారిఫ్‌లు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు బెదిరించడం గమనార్హం. ఆ సుంకాలపై ట్రంప్ వెనక్కి తగ్గినప్పటికీ.. వాణిజ్య ఉద్రిక్తతలపై ఈయూ భయాలు పూర్తిగా తొలగిపోలేదు. ఈ పరిణామాల వేళ భారత్‌తో ఒప్పందం చేసుకునేందుకు EU సమాఖ్య వేగిరపడింది.
ఆరునెలల సమయం…
భారత్-ఈయూ మధ్య ఈ ఒప్పందం అధికారికంగా కుదిరినప్పటికీ తక్షణ అమలు మాత్రం సాధ్యం కాదు. ట్రేడ్ డీల్‌కు సంబంధించిన న్యాయపరమైన అంశాలను పరిష్కరించుకునేందుకు దాదాపు ఆరు నెలల సమయం పట్టొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే.. డీల్ కుదిరినా.. ఆ మేరకు ఉపశమనం లభించాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే. మరోవైపు, EU దేశాల్లో ఉన్న రెగ్యులేటరీ నిబంధనలు కూడా ఈ ఒప్పందంపై ప్రభావం చూపించనున్నాయి. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి ఈయూ గత కొన్ని దశాబ్దాలుగా కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.
ఇక, ఈ ఏడాది జనవరి నుంచి కార్బన్ ట్యాక్స్‌ను తీసుకొచ్చింది. ఈ తరహా పన్ను వసూలుచేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. సిమెంట్, స్టీల్, అల్యూమినియం, ఆయిల్ రిఫైనరీ, పేపర్, గ్లాస్ వంటి ఉత్పత్తుల దిగుమతులపై ఈ పన్ను వర్తించనుంది. ఈయూకు భారత్ ఎగుమతి చేసే ఉత్పత్తుల్లో అత్యధికం అల్యూమినియం, ఇనుము, ఉక్కే కావడం గమనార్హం. ఇక, స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు, కార్పొరేట్ సుస్థిరత కోసం కూడా ఈయూ రూల్స్ రూపొందించింది.






