Gandhi Talks: ‘గాంధీ టాక్స్’ ట్రైలర్ విడుదల.. మాటల కంటే ఎక్కువ మాట్లాడిన నిశ్శబ్దం
క్యూరియస్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్, పింక్మూన్ మెటా స్టూడియోస్, మూవీ మిల్ ఎంటర్టైన్మెంట్తో కలిసి జీ స్టూడియోస్ రూపొందిస్తోన్న మూవీ ‘గాంధీ టాక్స్’ ట్రైలర్ విడుదలైంది. రొటీన్‌గా మనం చూసే సాంప్రదాయలను బద్దలు కొడుతూ, ధైర్యంగా వైవిధమ్యైన కథనాలకు, కంటెంట్‌కు ప్రాధాన్యమిచ్చే సినిమాలపై జీ స్టూడియోస్కున్న నమ్మకాన్ని ఈ సినిమా బలంగా చూపిస్తోంది.
సాధారణంగా సినీ పరిశ్రమ అంటే శబ్దాలు, హంగామా ఉంటుంది. కానీ వీటికి భిన్నంగా ‘గాంధీ టాక్స్’ నిశ్శబ్దంగా, ఆత్మ విశ్వాసంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ట్రైలర్లో ఎలాంటి డైలాగ్స్ లేవు. అయినప్పటికీ బలమైన దృశ్యాలు, భావోద్వేగంతో నిండిన నిశ్శబ్దం అన్నీ చాలా విషయాలను చెబుతున్నాయి. ప్రేక్షకులు సినిమాను చెవులతోనే కాదు.. మనసుతో వినాలని ఇచ్చిన స్టేట్‌మెంట్‌లా ఇది మనకు కనిపిస్తోంది.
గాంధీ టాక్స్ చిత్రంలో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరి, సిద్ధార్థ్ జాధవ్ లాంటి అద్భుతమైన నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. ట్రైలర్ చూస్తే భావోద్వేగాలను, మానసిక సంఘర్షణలను వారి తమ నటనతో కనపరిచారు. మాటలు లేనప్పటికీ వారి పాత్రలను పోషించటం.. వారి హావభావాలు కథలో ప్రధానంగా ఆకట్టుకుంటున్నాయి.
విజయ్ సేతుపతి మాట్లాడుతూ ‘‘గాంధీ టాక్స్’లో నటించటం నటుడిగా నాకొక పెద్ద చాలెంజ్‌గా మారింది. మౌనమే ఇందులో అత్యంత బలమైన డైలాగ్‌గా ఉన్న అరుదైన సినిమా ఇది’ అన్నారు.
అరవిందస్వామి మాట్లాడుతూ ‘శబ్దాలతో నిండిన ఈ ప్రపంచంలో మౌనం కూడా మన అంతరాత్మను కదిలించగలదని ‘గాంధీ టాక్స్’ మనకు గుర్తు చేస్తుంది. మాటలు లేకుండా నిజం నిశ్శబ్దంగా బయటకు వచ్చే సినిమా. దీనికి ఎ.ఆర్.రెహమాన్‌గారి అద్భుతమైన సంగీతమే కథను చెప్పే గొప్ప భాషగా మారింది’ అన్నారు.
అదితిరావు హైదరి మాట్లాడుతూ ‘గాంధీ టాక్స్ సినిమాలో మాటల కంటే భావాలే మనల్ని కదిలించటం నాకు బాగా నచ్చింది. సున్నితత్వం, మౌనం రెండూ ఎంతో అందంగా కలగలిసినట్లు ఈ సినిమా చూపిస్తుంది’ అన్నారు.
సిద్ధార్థ్ జాదవ్ మాట్లాడుతూ ‘డైలాగ్స్ లేకుండానే ఇంత బలంగా మాట్లాడేలా రూపొందించిన ‘గాంధీ టాక్స్’ సినిమాలో భాగం కావటం నిజంగా నాకెంతో ప్రత్యేకం. మాటలకు అతీతంగా సినిమా ఎందుకు మాట్లాడుతుందో ఈ సినిమా తెలియజేస్తుంది’ అన్నారు.
కిషోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గాంధీ టాక్స్’ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమాలో సంగీతమే కథలోని భావోద్వేగాలకు గొంతుకగా మారుతుంది. ఆయన స్వరాలు మౌనంలోనూ ప్రాణం పోస్తూ, ప్రతిభావంతులైన గాయకుల స్వరాలు మాటలేని క్షణాలకు మరింత భావోద్వేగాన్ని, బలాన్ని చేకూరుస్తాయి.
సాంప్రదాయానికి భిన్నంగా, ధైర్యంగా ఈ సినిమా నిర్మాతలు ట్రైలర్‌ను ఎ.ఆర్.రెహమాన్ సంగీత ప్రదర్శన కంటే మూడు రోజుల ముందే రిలీజ్ చేశారు. సినిమా, లైవ్ మ్యూజిక్ అరుదైన ఆలోచనాత్మక కలయిక ఇది. ఈ వైవిధ్యమైన ప్రమోషనల్ పద్ధతి సినిమా తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. పూర్తి అనుభవంతో, కళాత్మక దృష్టితో ఇది రూపొందించబడింది.
సాంప్రదాయాలను ఛాలెంజ్ చేసే సినిమాలను రూపొందించటం, సున్నితమైన నటనకు పట్టంకట్టటం, భారతీయ సినిమా హద్దులను చేరిపేసి సరికొత్త హద్దులకు సినిమాను తీసుకెళ్లటమే తమ సంకల్పమని గాంధీ టాక్స్ సినిమాతో జీ స్టూడియోస్ మరియు నిర్మాతలు తెలియజేశారు.
జనవరి 30న ‘గాంధీ టాక్స్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది.






