Panama : పనామా కాలువ మాదే.. గ్రీన్ లాండ్ ను కొనేస్తాం : ట్రంప్
త్వరలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇంకా గద్దెనెక్కక ముందే వివాదస్పద వ్యాఖ్యలతో దుమారం రేపుతున్నారు. ఇప్పటికే కెనడా (Canada) ను అమెరికా 51వ రాష్ట్రమంటూ వ్యాఖ్యానించిన ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారుల ర్యాలీలో మాట్లాడుతూ అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను కలిపే పనామా (panama) కాలువను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. అమెరికా వాణిజ్య, నావికా దళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని, వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. లేకపోతే ఆ కాలువను తిరిగి అప్పగించాలని పేర్కొన్నారు. అంతటితో ట్రంప్ ఆగలేదు. డెన్మార్క్‌కు అమెరికా రాయబారిని ప్రకటిస్తూ ఆ దేశ అధీనంలోని గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేస్తామని ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఆయన 2016లో అధ్యక్షుడిగా ఉన్న వేళ కూడా ఈ ప్రతిపాదన తెరపైకి రాగా, నాడు డెన్మార్క్ తిరస్కరించింది. తాజాగా ఆ దేశానికి అమెరికా రాయబారిగా కెన్ మౌరీని నియమించిన వేళ ట్రంప్ తన మనసులో మాటను బయటపెట్టారు.






