R Ashwin: వంద టెస్ట్ లు ఆడినా కెప్టెన్ లు కాని క్రికెటర్లు వీళ్ళే
టీం ఇండియా స్టార్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. భారత్ కు 106 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన అశ్విన్… బౌలింగ్, బ్యాటింగ్ లో కూడా తన సత్తా చాటాడు. అవసరమైన సమయాల్లో విలువైన ఇన్నింగ్స్ లు ఆడుతూ జట్టుకు వెన్నుముకగా నిలిచాడు ఈ తమిళనాడు ఆటగాడు. అయితే కెప్టెన్ మాత్రం కాలేకపోయాడు. ఇలా భారత్ కు వంద టెస్ట్ లు ఆడినా కెప్టెన్ కాలేకపోయిన ఆటగాళ్ళ జాబితా ఒకసారి చూద్దాం.
హర్భజన్ సింగ్
భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 103 టెస్టు మ్యాచ్‌ల్లో 417 వికెట్లు పడగొట్టాడు. భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం అతనికి రాలేదు.
వీవీఎస్ లక్ష్మణ్
భారత మాజీ బ్యాట్స్‌మెన్ వంగీపురపు వెంకట సాయి లక్ష్మణ్ భారత్ తరఫున టెస్టుల్లో 134 మ్యాచ్‌లు ఆడాడు. నిలకడగా రాణించినా, లక్ష్మణ్‌కు ఎప్పుడూ టీమ్ ఇండియా బాధ్యతలు అప్పగించలేదు. వేరి వేరి స్పెషల్ బ్యాట్స్‌మెన్ తన కెరీర్లో టెస్టుల్లో 8781 పరుగులు చేశాడు.
ఇషాంత్ శర్మ
భారత వెటరన్ పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ (Ishanth Sharma) ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్ లో 105 మ్యాచ్‌లు ఆడాడు. ఇన్ని మ్యాచ్ ల్లో జట్టులో భాగమైన ఇషాంత్ శర్మ ఎప్పుడూ జట్టుకు కెప్టెన్ గా జట్టుని నడిపించలేదు. ఈ వెటరన్ ఆటగాడు భారత్ తరఫున 311 టెస్టు వికెట్లు కూడా సాధించాడు.
పుజారా
భారత టెస్టు స్పెషలిస్ట్ ఛెతేశ్వర్ పుజారా కూడా భారత్ తరఫున 100 మ్యాచ్ లు పూర్తి చేశాడు. ఇప్పటివరకు, అతను 103 టెస్టులు ఆడాడు. 7,195 పరుగులు చేశాడు. కానీ అతనికి కెప్టెన్ అయ్యే అవకాశం రాలేదు.
ఆర్ అశ్విన్
106 టెస్టుల్లో భారత్ కు అత్యంత కీలక ఆటగాడిగా ఉన్న అశ్విన్… ఎన్నడు కెప్టెన్ కాలేకపోయాడు. కాని బౌలింగ్ విభాగాన్ని మాత్రం సమర్ధవంతంగా నడిపించాడు అశ్విన్.






