అమెరికన్ల బతుకు కష్టాలు.. !
పశ్చిమాసియా యుద్ధం అమెరికన్ల జీవితాల్ని కష్టతరం చేస్తోంది. ముఖ్యంగా నిత్యవసర ధరలు పెరిగిపోవడంతో..సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిరాణా సరుకులు, గ్యాసోలిన్ (పెట్రోల్), విద్యుత్ వంటి యుటిలిటీ బిల్లుల ధరలు ఆకాశాన్నంటడంతో వారి జీవనం కష్టతరంగా మారింది. అమెరికా ప్రభుత్వం కొత్తగా విధించిన టారిఫ్‌లు, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలు.. ఈ రెండు అంశాలు కలిసి సామాన్యుడిపై పెను భారం మోపుతున్నాయని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితి ఆర్థిక వృద్ధికి సైతం గండికొట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ధరల పెరుగుదలతో తమ బతుకులు కష్టతరంగా మారుతున్నాయని కొందరు అమెరికన్లు వాపోతున్నారు. ముఖ్యంగా తమ జీవితాలు బాగు చేస్తారని ట్రంప్ కు ఓటేశామని..ఇప్పుడు తమ బతుకులు మరింతగా దిగజారాయని వారు నిట్టూరుస్తున్నారు . కనీస వేతనంతో పనిచేస్తున్న కాలిఫోర్నియాకు చెందిన 66 ఏళ్ల కేటీ పెయ్రే తన మనవడితో కలిసి జీవిస్తున్నారు. ట్రంప్ అధికారంలోకి రాకముందు తన నెలవారీ ఖర్చులు 2,300 డాలర్లు (రూ. 2,16,704) ఉండేవని, ఇప్పుడు అవి 2,500 డాలర్లు (రూ. 2,35,548) దాటాయని, దీంతో కుటుంబాన్ని పోషించడం భారంగా మారిందని ఆమె వాపోయారు.
ఇవి కూడా చదవండి
లాస్ ఏంజెలెస్‌కు చెందిన 34 ఏళ్ల క్రిస్టియన్ డెవిటో కూడా ఇదే రకమైన ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడు నెలల్లో తన నెలవారీ బిల్లులు 15 శాతం పెరిగాయని తెలిపారు. “ప్రయాణ ఖర్చులు వారానికి 50 నుంచి 70 డాలర్లకి పెరిగాయి. ఇప్పుడు ఆహారం కూడా తగ్గించుకోవాల్సి వస్తోంది” అని ఆయన అన్నారు. ప్రభుత్వ గణాంకాలు కూడా ఈ ఆందోళనలను బలపరుస్తున్నాయి. యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం మార్చిలో ఇంధన ధరలు 10.9% పెరగ్గా, గ్యాసోలిన్ ధరలు ఏకంగా 21.2% పెరిగాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
టారిఫ్‌ల వల్ల వినియోగదారులపై పడే భారం దాదాపు సమానంగా ఉంటుందని ఫెడరల్ రిజర్వ్ పరిశోధనలో తేలింది. పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అంచనా ప్రకారం కెనడా, మెక్సికో, చైనా నుంచి దిగుమతులపై విధించిన టారిఫ్‌ల వల్ల సగటు అమెరికన్ కుటుంబంపై ఏటా 1200 డాలర్ల (రూ. 1,13,063) అదనపు భారం పడుతుంది. ధరల ఒత్తిడి కొనసాగితే, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు అధికంగానే ఉంచుతామని ఫెడరల్ రిజర్వ్ ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఇది క్రెడిట్ కార్డులు, ఆటో లోన్లపై భారాన్ని మరింత పెంచుతుంది. “త్వరలోనే మంచి వార్త వస్తుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరో ఏడాదిని మేము తట్టుకోలేము” అని కేటీ పెయ్రే తన నిస్సహాయతను వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి






