శతృభయంకరం సార్మాట్ క్షిపణి.. ప్రపంచానికి చూపించిన రష్యా..
రష్యా ప్రయోగించిన సరికొత్త ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సార్మాట్.. ఇప్పుడు ప్రత్యర్థులకు చమటలు పట్టిస్తోంది. అణ్వస్త్ర బలగాలను బలోపేతం చేయడంలో భాగంగా రష్యా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన క్షిపణిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అభివర్ణించారు. సోవియట్ కాలం నాటి అస్త్రాల స్థానంలో దీన్ని ప్రవేశపెడతామన్నారు. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన సార్మాట్ క్షిపణి ఈ ఏడాది చివర్లోగా సైనిక దళాల్లో చేరుతుందని చెప్పారు. ఈ క్షిపణిలోని వార్హెడ్ల ఉమ్మడి శక్తి.. పశ్చిమ దేశాలకు చెందిన అస్త్రాల కన్నా నాలుగు రెట్లు అధికమని చెప్పారు. సార్మాట్ క్షిపణిని సాటన్-2గా కూడా పిలుస్తారు. దీని అభివృద్ధి 2011లో ప్రారంభమైంది.సార్మాట్కు అమెరికాకు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలన్నింటినీ బోల్తా కొట్టించే సత్తా ఉందని పుతిన్ పేర్కొన్నారు. 35వేల కిలోమీటర్లకుపైగా పరిధిని ఇది కలిగి ఉందన్నారు.
ఇవి కూడా చదవండి
బాలిస్టిక్ క్షిపణి సార్మాట్ (RS-28 Sarmat) అనేది రష్యాకు చెందిన అత్యంత భారీ మరియు అత్యంత శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM). దీనిని పాశ్చాత్య దేశాలు, నాటో (NATO) కూటమి సైనిక వర్గాలు ‘సాటన్-2’ (Satan II) అని పిలుస్తాయి. సోవియట్ కాలం నాటి పాత ఆర్-36ఎమ్ ‘సాటన్’ క్షిపణుల స్థానంలో రష్యా వ్యూహాత్మక అణు బలగాలను బలోపేతం చేయడానికి దీనిని అభివృద్ధి చేశారు.
పాశ్చాత్య దేశాల అంచనా ప్రకారం దీని పరిధి 18,000 కిలోమీటర్లు. దీని సబ్‌ఆర్బిటల్ (Sub-orbital) సాంకేతికత వల్ల 35,000 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణించగలదని రష్యా తెలిపింది.ఇది దాదాపు 10 టన్నుల బరువున్న పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. ‘మిర్వ్’ (MIRV – Multiple Independently Targetable Re-entry Vehicles) సాంకేతికత ద్వారా ఒకే క్షిపణి 10 నుండి 16 విడివిడి అణు వార్హెడ్లను మోసుకెళ్లి, వేర్వేరు లక్ష్యాలపై ఒకేసారి దాడి చేయగలదు.
రష్యాకు చెందిన అత్యాధునిక ‘అవాంగార్డ్’ (Avangard) హైపర్సోనిక్ గ్లైడ్ వాహనాలను కూడా దీని ద్వారా ప్రయోగించవచ్చు. ఇవి శబ్దం కంటే 20 రెట్లకు పైగా వేగంతో ప్రయాణిస్తాయి. అమెరికా వంటి దేశాల ప్రస్తుత గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థలను (Missile Defence Systems) సులభంగా బోల్తా కొట్టించేలా దీనిని రూపొందించారు. ఇది సాంప్రదాయ ఆర్క్టిక్ మార్గాల్లో కాకుండా, దక్షిణ ధృవం (South Pole) మీదుగా కూడా ప్రయాణించి ఊహించని దిశల నుండి లక్ష్యాలను తాకగలదు.
ఇవి కూడా చదవండి






