Rohith Sharma: మళ్ళీ ఓపెనర్ గా రోహిత్… క్లారిటీ ఇచ్చేసిన నాయర్
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టులో రోహిత్ శర్మ (Rohith Sharma) తిరిగి ఓపెనింగ్ కు వస్తాడని టీం ఇండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ప్రకటించాడు. బాక్సింగ్ డే టెస్టు తొలిరోజు ఆట ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో నాయర్ ఇదే విషయాన్ని స్పష్టం చేసాడు. వ్యక్తిగత కారణాల వల్ల పెర్త్ టెస్టుకు దూరమైన రోహిత్ ఆరేళ్ల తర్వాత తొలిసారి మిడిలార్డర్లో బ్యాటింగ్ చేశాడు. బ్రిస్బేన్, అడిలైడ్ టెస్ట్ లలో 6.33 సగటుతో మూడు ఇన్నింగ్స్ లలో 10 పరుగుల టాప్ స్కోరుతో 19 పరుగులు చేసాడు.
దీనితో రోహిత్… మిడిల్ ఆర్డర్ లో తడబడుతున్నాడు. అయితే ఓపెనర్ గా కెఎల్ రాహుల్ (KL Rahul) రాణించడంతో జట్టు పునరాలోచనలో పడింది. అయితే రాహుల్ ను మూడో స్థానంలో ఆడించేందుకు జట్టు యాజమాన్యం ఒప్పించింది. దీనితో రోహిత్ ఓపెనర్ గా రానున్నాడు. ఈ ఏడాది బంగ్లాదేశ్ పై సిరీస్ గెలిచిన తర్వాత భారత్ రోహిత్ నేతృత్వంలో ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ కూడా గెలవలేదు. మొన్న ఓటమి నుంచి బయటపడి డ్రా చేసుకుంది. ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడంతో రోహిత్ కెప్టెన్గా కూడా ఒత్తిడిలో ఉన్నాడు.
ఇక కాంబినేషన్ సెట్ కాకపోవడంతో గిల్ ను పక్కన పెట్టామని నాయర్ తెలిపాడు. గాయం కారణంగా పెర్త్ టెస్టుకు దూరమైన తర్వాత… అడిలైడ్ ఓవల్లో జరిగిన డే-నైట్ టెస్టులో గిల్ 31, 28 స్కోర్లు చేసాడు. ఇక మూడో టెస్ట్ లో గిల్ ఒక్క పరుగు మాత్రమే చేసాడు. గిల్ ను పక్కన పెట్టడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక గిల్ స్థానంలో బౌలింగ్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చాడు. కీలకమైన నాలుగో టెస్ట్ లో భారత్ కచ్చితంగా గెలవాల్సిందే. లేదంటే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ కు అర్హత సాధించడం కష్టమే.






