Putin: మోదీతో తనకు మంచిసంబంధాలు… కుదిరితే కప్పు టీ
భారత ప్రధాని నరేంద్ర మోదీతో తనకు మంచి అనుబంధం ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) వెల్లడించారు. ప్రపంచ నేతల్లో తనకున్న స్నేహితుల్లో ఆయనొకరని వార్షిక సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ నేతల్లో ఎవరితో నాలుగు మాటలు పంచుకుంటూ కప్పు తేనీరు కలిసి సేవించాలనుకుంటున్నారని ప్రశ్నించగా ఆయన బదులిచ్చారు. జర్మనీ మాజీ ఛాన్సలర్ హెల్ముట్ కోల్, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు జాక్వెస్ చిరాక్, ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీతో నాకు మంచి అనుబంధం ఉంది. అలాగే ఆసియాలో భారత ప్రధాని మోదీ(Modi), చైనా అధ్యక్షుడు జిన్పింగ్ (Jinping) నాకు మిత్రులు అని వెల్లడించారు. బ్రిక్స్ గురించి పశ్చిమదేశాలు వ్యక్తం చేస్తోన్న ఆందోళనను ఉద్దేశించి ఓ సందర్భంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ( Jaishankar) చేసిన వ్యాఖ్యను పుతిన్ ప్రస్తావించారు. బ్రిక్స్ పశ్చిమదేశాలను వ్యతిరేకించే బృందం కాదు. బ్రిక్స్ ఏ దేశానికి వ్యతిరేకంగా పనిచేయడం లేదు. సభ్య దేశాల ప్రయోజనం కోసం మాత్రమే పని చేస్తుందని అని స్పష్టం చేశారు.






