H1B VISA :హెచ్ 1బీ వీసాల్లో అయిదోవంతు మనకే
అమెరికా జారీ చేసే హెచ్1బీ వీసాల్లో భారత ఐటీ కంపెనీలు దూకుడు చూపిస్తున్నాయి. మొత్తం హెచ్1బీ వీసాల్లో అయిదింట ఒకవంతు మన సంస్థలే దక్కించుకున్నాయి. అమెరికా ఇమిగ్రేషన్ విభాగం గణాంకాల ప్రకారం.. హెచ్1బీ వీసాలు పొందడంలో ఇన్ఫోసిస్(Infosys), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(Tata Consultancy Services) (టీసీఎస్) ఈ ప్రక్రియలో ముందున్నాయి. 2024 ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య అమెరికా జారీ చేసిన 1.3 లక్షల హెచ్1బీ వీసాల్లో 24,766 వీసాలను భారత సంతతి కంపెనీలే పొందాయి. అత్యధిక వీసాలు పొందిన వాటిలో అమెజాన్ కామ్ సర్వీసెస్ (Amazon Com Services) ఎల్ఎల్సీ ముందుంది. ఈ సంస్థకు 9,265 వీసాలు లభించాయి. దీని తర్వాత స్థానం ఇన్ఫోసిస్దే. న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్ ( 6,321 వీసాలు) మూడో స్థానంలో నిలిచింది.
భారత్ సంస్థలో 8,140 వీసాలతో ఇన్ఫోసిస్ అగ్రస్థానంలో నిలిచింది. టీసీఎస్ (5,274), హెచ్సీఎల్ అమెరికా (2,953) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈసారి విప్రో (1,634 వీసాలు), టెక్ మహీంద్ర (1,199 వీసాలు) కొంచెం వెనకబడ్డాయి. అమెరికా కంపెనీలు, తాత్కాలిక ప్రాతిపదికపై, ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు హెచ్1బీ వీసా కార్యక్రమం అనుమతిస్తోంది. హెచ్1బీ వీసాలతో భారత ఐటీ రంగం భారీగా లబ్ధి పొందుతోంది.






