Virat kohli: అంత దురద ఎందుకు కోహ్లీ…? కోహ్లీని వీక్నెస్ తో కొడుతున్న ఆసీస్
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో 3వ రోజు తన పేలవమైన ప్రదర్శనతో విరాట్ కోహ్లీ (Virat kohli) సొంత అభిమానుల నుంచే విమర్శలు, సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. అతను మొదటి ఇన్నింగ్స్ లో జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. రెండో టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లలో కూడా కోహ్లీ ఇలాగే వికెట్ చేజార్చుకున్నాడు. విలువైన సమయంలో కూడా కోహ్లీ మళ్ళీ అదే చెత్త ఆటతో… వదిలేయాల్సిన బాల్ ను డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేసి క్యాచ్ ఇచ్చాడు. 16 బంతుల్లో కేవలం 3 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (BGT) లో చివరి మూడు ఇన్నింగ్స్ ల్లో 3, 11, 7 పరుగులు మాత్రమే చేసిన కోహ్లి ప్రదర్శన దారుణంగా ఉంది. సెంచరీ చేసి ఫాంలోకి వచ్చాడు అనే సంతోషం కూడా ఫ్యాన్స్ కు లేకుండా పోయింది. ఆస్ట్రేలియా కోహ్లీ వీక్నెస్ పట్టుకుందని, అదే విధంగా బౌలింగ్ చేస్తున్నా కోహ్లీ గ్రహించడం లేదని ఫ్యాన్స్ తిట్టడం మొదలుపెట్టారు. గౌరవంగా రిటైర్ కావాలి అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్… ఏ దశలో కూడా మెరుగైన ప్రదర్శన చేయలేదు. ఓ పక్కన కెఎల్ రాహుల్ సాలిడ్ డిఫెన్స్ తో నిలబడుతుంటే ఇతర ఆటగాళ్ళు మాత్రం అవుట్ కావడానికే దిగినట్టు ప్రదర్శన చేయడం ఆశ్చర్యం కలిగించింది. భారత్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఇక పదే పదే వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో భారత్ ఒకరకంగా ఆల్ అవుట్ నుంచి బయటపడినట్టే కనపడింది. ఇంకో రెండు రోజులు ఆట ఉన్న నేపధ్యంలో భారత్ ఎంత వరకు నిలబడుతుందో చూడాలి. ఫాలో ఆన్ తప్పించుకోవాలి అంటే భారత్ 246 పరుగులు చేయాల్సి ఉంది.






