Australia: ఆసిస్ కు బిగ్ షాక్, సీరీస్ నుంచి సీనియర్ ప్లేయర్ అవుట్
రెండో టెస్ట్ లో గెలిచి, మూడో టెస్ట్ లో దాదాపు గెలిచే పరిస్థితిలో ఉన్న ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా సీమర్ జోష్ హేజిల్‌వుడ్ (Hazlewood) గాయం కారణంగా భారత్ (India)తో జరిగే మిగతా టెస్టు సిరీస్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. 33 ఏళ్ల ఈ సీనియర్ ఆటగాడు… బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టులో నాలుగో రోజు ముందు వార్మప్ సమయంలో ఇబ్బందిగా కనిపించాడు. ఉదయం సెషన్లో ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసి అనంతరం డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితం అయ్యాడు.
తోడ కండరాలు పట్టేయడంతో అతనిని వెంటనే స్కానింగ్ కోసం పంపింది క్రికెట్ ఆస్ట్రేలియా. గాయం కారణంగా మెల్బోర్న్, సిడ్నీలలో జరిగే నాలుగు, ఐదు టెస్టులకు అతను దూరమయ్యే అవకాశం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో గాయం కారణంగా దూరం కావడం స్కాట్ బొలాండ్ ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఈ ఉదయం వార్మప్ లో అతను ఇబ్బందిగా కనిపించాడని, అందుకే ఒత్తిడి చేయడం లేదని ఆసిస్ బౌలింగ్ కోచ్ డేనియల్ వెట్టోరి తెలిపాడు.
మరో గాయం తర్వాత అతడిని ఒత్తిడి చేయలేమని, అతను జట్టులో లేకపోతే ఇబ్బందే అని చెప్పుకొచ్చాడు. అతను ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడని కొనియాడాడు. అతను దూరం కావడం జట్టు ప్రదర్శనను ప్రభావితం చేస్తుందని తెలిపాడు. ఇక మూడో టెస్ట్ లో భారత్… ఓటమి నుంచి దాదాపుగా తప్పించుకున్నట్టే కనపడుతోంది. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ రాణించడంతో ఫాలో ఆన్ గండం నుంచి బయటపడింది భారత్. రాహుల్ కు తోడుగా జడేజా ఆఫ్ సెంచరీ చేయగా.. నితీష్, బూమ్రా, ఆకాష్ దీప్ ఆస్ట్రేలియా బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు.






