Washington: పాక్ తో ట్రేడ్ డీల్.. భవిష్యత్తులో భారత్ కు చమురు ఎగుమతులు జరగొచ్చన్న ట్రంప్..

Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను పొలిటీషియన్ గా చూడడం కన్నా ఓ ప్రొఫెషనల్ వ్యాపారవేత్తగా భావించవచ్చు. ఎందుకంటే ఆయన నిర్ణయాల్లో అధికశాతం వ్యాపారపరంగానే ఉంటాయి. కానీ పొలిటికల్ గా పెద్దగా ప్రభావాన్ని చూపించినట్లు కనిపించవు..ప్రత్యర్థి దేశాధినేతలతో సైతం నేరుగా బిజినెస్ డీల్స్ మాట్లాడడంలో ట్రంప్ దిట్టని చెప్పవచ్చు. దీంతో ఆయా దేశాలు సైతం ట్రంప్ చర్చల్ని ఆకోణంలోనే చూస్తున్నట్లు కనిపిస్తోంది.
బిజినెస్ బిజినెస్సే.. చర్చలు చర్చలే అన్నది ట్రంప్ భావనగా కనిపిస్తోంది. అందుకే ఓ వైపు భారత్ పై 25శాతం పన్నులు వేసేశారు. అదే సమయంలో పాకిస్తాన్ తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇక్కడే ఓ కీలక కామెంట్ చేశారు ట్రంప్. అది ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆకర్షించింది. భవిష్యత్తులో భారత్ (India) కు పాక్ చమురు విక్రయించవచ్చని వ్యాఖ్యానించారు. భారత దిగుమతులపై 25శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు (US Tariffs).
ట్రేడ్ డీల్స్ గురించి ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. అమెరికా, పాక్‌ల మధ్య ఒక వాణిజ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇరుదేశాలు చమురు నిల్వలను పెంచుకోవడంలో కలిసి పనిచేస్తాయన్నారు. అందుకోసం ఒక మంచి చమురు కంపెనీని ఎంచుకునే ప్రక్రియలో ఉన్నామన్నారు. దీని కారణంగా భవిష్యత్తులో భారత్‌కు పాక్ చమురు విక్రయించొచ్చు అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇక, వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి అనేక దేశాల నాయకులతో మాట్లాడానని ట్రంప్ పేర్కొన్నారు. వారంతా యూఎస్‌ను సంతోషపెట్టాలని చూస్తున్నారన్నారు. అదేవిధంగా మరికొన్ని దేశాలు సుంకాల తగ్గింపు కోసం ప్రతిపాదనలు చేస్తున్నాయని తెలిపారు. ఇవన్నీ వాణిజ్య లోటును తగ్గించడంలో సహాయపడతాయన్నారు. ఈ ఒప్పందంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందిస్తూ.. ట్రంప్‌నకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందం భవిష్యత్తులో తమ భాగస్వామ్యం కొనసాగేందుకు ఉపయోగపడుతుందన్నారు.
టారిఫ్‌లు ప్రకటించిన అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. సుంకాలపై భారత్‌తో ఇంకా చర్చలు జరుపుతున్నామన్నారు. ఈసందర్భంగా మరోసారి బ్రిక్స్‌ను ప్రస్తావించారు. యూఎస్‌కు వ్యతిరేకంగా, డాలర్‌ను అణగదొక్కాలని బ్రిక్స్ దేశాలు చూస్తున్నాయని ఆరోపించారు. భారత్ కూడా ఆ కూటమిలో భాగమేనన్నారు. కానీ, అది జరగనివ్వనని స్పష్టంచేశారు. భారత ప్రధాని మోడీ తనకు మంచి స్నేహితుడని ఉద్ఘాటించారు. అయితే, వారు పెద్దఎత్తున సుంకాలు విధిస్తున్నారని ప్రస్తుతం వాటిని తగ్గించేందుకు ఆ దేశం సిద్ధమైందని పేర్కొన్నారు.