KTR: అరాచక పాలనకు అంతం పలకాలంటే.. సునీత గెలవాలి : కేటీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రేవంత్‌రెడ్డి అందర్నీ మోసం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బోరబండ డివిజన్లో ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో మరో అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారని నిలదీశారు. కేసీఆర్ (KCR) ప్రభుత్వం ఉన్నప్పుడు అగ్రస్థానంలో ఉన్న తెలంగాణను, అట్టడుగు స్థానానికి దిగజార్చారని మండిపడ్డారు. ఇది కారు బుల్డోజర్ మధ్య జరుగుతున్న పోటీ. బోరబండకు బుల్డోజర్కు వచ్చి ఇళ్లు కూల్చేయవద్దంటే, మాగంటి సునీత గెలవాలి. ఆమెను గెలిపిస్తే అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా నిలబడతాం. తన కుర్చీ కాపాడుకోవడానికి రాహుల్‌గాంధీ రేవంత్‌రెడ్డి ముడుపులు పంపుతున్నారు. ఇప్పుడు ఆయన మళ్లీ ప్రచారానికి వచ్చి గెలిపిస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తానని కాకమ్మ కథలు చెబుతున్నారు.
కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచి 16 నెలలవుతోంది. రూ.16 అయినా మంజూరు చేశారా? అక్కడ చేయని అభివృద్ధి జూబ్లీహిల్స్‌లో ఎలా చేస్తారు? విద్యార్థులకు, నిరుద్యోగులకు రేవంత్‌రెడ్డి హామీలిచ్చి, వారినీ మోసం చేశారు. కాంగ్రెస్ నాయకుల జేబులు మాత్రం నిండాయి. ఉద్యోగాల నోటిఫికేషన్ లేదు. లూటీఫికేషన్ మాత్రం జోరుగా సాగుతోంది. నిరుద్యోగులను లాఠీలతో కొట్టించే పరిస్థితికి తీసుకువచ్చారు. రెండేళ్ల అరాచక పాలనకు అంతం పలకాలంటే సునీత గెలవాలి అన్నారు.







