Bullet train: చైనా హైస్పీడ్ రైల్.. గంటకు 450 కిలోమీటర్లు..(450km/hr)
కమ్యూనిస్టు చైనా(China)… ఆవిష్కరణలతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. టెక్నాలజీతో ప్రపంచంపై ఆధిపత్యం సాధించగలమని బలంగా నమ్ముతున్న చైనా.. ఆదిశగా అడుగులేస్తోంది. లేటెస్టుగా గంటకు అత్యధికంగా 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల బుల్లెట్ రైలును(bullet train) ప్రపంచానికి పరిచయం చేసింది. దీనిని CR450 గా వ్యవహరిస్తోంది. ఆదివారం బీజింగ్‌లో పరీక్షించారు. గంటకు 400 కిలోమీటర్ల వేగాన్ని అందుకొంది. ఈ రైల్ డిజైన్ చాలా నాజుగ్గా, బుల్లెట్ షేప్ ముక్కుతో ఉంటుందని చైనా రైల్వే(china railway) వెల్లడించింది. ఇది అత్యధికంగా గంటకు 450 కిమీ వేగాన్ని అందుకోగలదని తెలిపింది.ఈ ట్రైన్ బీజింగ్(Bejing) నుంచి షాంఘైకి(Shanghai) కేవలం 2.5 గంటల్లోనే ప్రయాణించగలదు. గతంలో ఈ ప్రయాణానికి నాలుగు గంటల సమయం పట్టేది.
ప్రస్తుతం చైనాలోని హైస్పీడ్ రైలు వ్యవస్థ అతిపెద్దది. మొత్తం 45,000 కిలోమీటర్ల మేరకు విస్తరించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే చైనా ప్రభుత్వరంగ రైల్వే సంస్థ సీఆర్450 ప్రొటోటైప్‌ను డిసెంబర్లో పరీక్షిస్తామని వెల్లడించింది.. చైనా 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. దీని కింద హైస్పీడ్ రైళ్లు, వంతెనలు, ట్రాక్‌లు, సొరంగాలు నిర్మించనున్నారు. ఈ రైలు బాడీ బరువు కేవలం 10 టన్నులు మాత్రమే. ప్రస్తుతం CR 400 మోడల్ కంటే ఇది 12 శాతం తక్కువ. విద్యుత్తును కూడా 20 శాతం తక్కువగానే వినియోగించుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక గత మోడల్ కంటే అదనంగా 50 కిలోమీటర్లు అధిక వేగంతో ప్రయాణించగలదు. ఇంజిన్ పరీక్షల్లో ఇది అత్యధికంగా గంటకు 453 కిమీ వేగాన్ని అందుకుంది.
చైనా రెండ్రోజుల క్రితమే ఆరో తరానికి చెందినదిగా చెబుతున్న జె-36 యుద్ధ విమానాన్ని ఆవిష్కరించింది. సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డూలో దీనిని అభివృద్ధి చేసినట్లు భావిస్తున్నారు. దీనికి మూడు ఇంజిన్లు అమర్చినట్లు భావిస్తున్నారు. ఇది అమెరికాకు చెందిన ఎఫ్-35, ఎఫ్-22 రాప్టర్లను సవాలు చేయగలదని చెబుతున్నారు.






