Biden: అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక ప్రకటన
గ్రీన్హౌస్ ఉద్గారాల విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden ) కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025 కల్లా తాము వెదజల్లుతున్న ఉద్గారాల్లో 66 శాతం కంటే ఎక్కువ కోత పడేలా పర్యావరణ హిత చర్యలు తీసుకుంటామని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వచ్చే నెల అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న కీలక సమయంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వాతావరణ మార్పుల అంశంలో ట్రంప్ వైఖరి భిన్నంగా ఉంది. ఉద్గారాలు తగ్గించుకోవడానికి సుముఖంగా లేరు. ట్రంప్ అధికారంలోకి రాగానే పారిస్ (Paris) వాతావరణ ఒప్పందం నుంచి కూడా అమెరికా వైదొలగుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బైడెన్ ప్రకటన ఏ మేరకు అమలవుతుందన్నది అనుమానమే. భూతాపం తగ్గించేందుకు వీలుగా గతంలో 2030 కల్లా గ్రీన్హౌస్ ఉద్గారాలను 50 శాతం తగ్గిస్తామని అమెరికా పేర్కొంది. ఇప్పుడు ఆ శాతాన్ని మరింత పెంచింది.






