అంగారకుడిపై డొనాల్డ్ ట్రంప్ కన్ను
ముందుగా స్వదేశం, తర్వాత విదేశాలపై కన్నేసి ఎన్నో సంచల నిర్ణయాలు తీసుకున్న అమెరికా అధ్యక్షుడు ఇక వీటిని వదిలి తన ఆలోచనను మరింత ఆప్‌గ్రేడ్ చేసుకున్నట్లున్నారు. రాష్ట్రాలు, దేశాలు వీడి ఏకంగా గ్రహాలపై కన్నేసినట్లు కనపడుతోంది. మానవుడు అంగారకున్ని జయించాలని ఎప్పటి నుంచో కంటున్న కలలను తాను సాకారం చేయాలన్న పట్టుదల ఆయనలో రేకిత్తినట్లు తెలుస్తోంది. అందుకే అరుణగ్రహంపైకి మనుషులను పంపించి ఆ క్రెడిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోవాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నాడు. అంగారకునిపైకి మనుషులను పంపేందుకు చేస్తున్న నాసా ప్రాజెక్టు కోసం ఆయన ఏకంగా లక్షా 30వేల కోట్ల రూపాయలను కేటాయించారు.
2018 సంవత్సరానికి గాను నాసా ట్రాన్సిషన్ ఆథరైజేషన్ యాక్ట్ కింద ఈ నిధులను ఇచ్చారు. 2030 నాటికి అంగారకుడి మీదకు మనిషిని పంపాలన్నది నాసా లక్ష్యం. దీనికి సంబంధించిన బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. నాసా చేపట్టిన అత్యంత ముఖ్యమైన ఈ కార్యక్రమానికి ఆధిక మొత్తంలో నిధులివ్వడం ద్వారా దీనిని మరింత ముందుకు తీసుకుపోవాలన్నదే ట్రంప్ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. దాదాపు ఆరు దశాబ్దాలుగా నాసా చేస్తున్న కృషి వల్ల లక్షలాది మంది అమెరికన్లు సుదూర ప్రపంచం గూర్చి ఊహించుకుంటూ ఇక్కడే భూమిమీద మెరుగైన భవిష్యత్తు వస్తుందని ఆశిస్తున్నారంటూ ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.
