అమెరికాలో మన భద్రత ఇక అంతేనా?
అమెరికాలో ఉంటున్న భారతీయులు, విద్యార్థులపై దాడులు పెరిగిపోతున్నాయి. మిసిసిపి రాష్ట్రం క్లింటన్ సిటీలో సాయివరుణ్ అనే విద్యార్థి ఎంఎస్ చదువుతూ స్థానిక షెల్ గ్యాస్ స్టేషన్లో పార్ట్‌టైం జాబ్ చేస్తున్నాడు. అమెరికా కాలమాన ప్రకారం శనివారం రాత్రి 8గంటల సమయంలో గ్యాస్‌స్టేషన్ కార్యాలయంలోకి నల్లరంగు ముసుగు దుస్తులు ధరించిన దుండగుడు చొరబడ్డాడు. ఆ సమయంలో వరుణ్ శ్రీరాంపూర్‌లో ఉన్న తల్లి జయలక్ష్మితో వీడియోకాల్‌లో మాట్లాడుతున్నాడు. లోపలికి వచ్చిన దుండుగుడు తుపాకీతో బెదిరించి లాకర్లు తెరిచి డబ్బులన్నీ దోచుకున్నాడు. ఈ క్రమంలో ‘గెటవుట్ ఆఫ్ మై కంట్రీ’ (మా దేశాన్ని విడిచి వెళ్లిపో) అంటూ పలుమార్లు తుపాకీ తలపై పెట్టి బెదిరించాడని వరుణ్ చెప్పాడు. అప్పటికే వీడియోకాల్‌లో మాట్లాడుతున్న జయలక్ష్మి ఇదిచూసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెద్ద కుమారుడు సాయికిరణ్‌కు ఫోన్ చేసి చెప్పడంతో అతను తమ్ముడి వద్దకు వెళ్లాడు. సీసీటీవీలో దోపిడీ దృశ్యాలను చూసి కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు..
