బే ఏరియాలో సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలతో ఎంపీ శ్రీభరత్ భేటీ
బే ఏరియా: బే ఏరియాలో తెలుగు ప్రముఖులు, భారతీయ వ్యాపారవేత్తలు, సాంకేతిక నిపుణులు, పెట్టుబడిదారులు, పరిశోధకులు, వైద్యులు, కమ్యూనిటీ నాయకులతో విశాఖ ఎంపీ ముతుకుమిల్లి శ్రీభరత్ సమావేశమయ్యారు. నేటి ఏఐ, డీప్ టెక్నాలజీ యుగంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఎన్ఆర్ ఐ లు ఆంధ్రప్రదేశ్, భారతదేశ అభివృద్ధికి ఎలా తోడ్పడగలరో ఈ సందర్భంగా చర్చించారు. ఈ చర్చలో ఇన్నోవేషన్, సంస్థల నిర్మాణం, గ్లోబల్ టాలెంట్‌ను భవిష్యత్‌కు సిద్ధమైన పాలనతో అనుసంధానం చేసే ఆంధ్రప్రదేశ్ సామర్థ్యంపై దృష్టి సారించినట్లు చెప్పారు. గ్లోబల్ ఇండియన్ డయాస్పోరా బలం పెట్టుబడులకు మాత్రమే కాకుండా మెంటర్షిప్, జ్ఞాన భాగస్వామ్యం, అంతర్జాతీయ అనుభవం, అమలు సామర్థ్యంలోనూ ఉందని తెలిపారు. అలాగే, ఆంధ్రప్రదేశ్, భారతదేశానికి దీర్ఘకాలిక ప్రభావం కలిగించే కార్యక్రమాలపై దృష్టి అవసరమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత వ్యాపారవేత్తలు ప్రవీణ్ అక్కిరాజు (ఇన్సైట్ పార్ట్నర్స్), బీవీ జగదీష్ (కాజ్ వెంచర్స్), మురళి చిరాల (వెంచర్ డాక్), పద్మజ దాసరి (ఓపెన్ఏఐ), భారత తాకులపల్లి (ఎస్పిఓసీ బయో), రవి తేజ కన్నెగంటి (వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్), నాగ శ్రీధర్ కటారు (ఘోస్ట్ సోషల్), రవి థాపర్ (అంబాసడర్, మాజీ దౌత్యవేత్త), అరుణ్ పెన్మెత్స (స్టార్మ్ వెంచర్స్), అనురాగ్ నల్లపాటి (షామ్రాక్ ఏఐ) పాల్గొన్నారు.