ఐటీలో ఉద్యోగాల గల్లంతు
అమెరికాలో ట్రంప్ శకం దేశీ ఐటి పరిశ్రమకు పెను శాపంగా పరిణమిస్తోంది. హెచ్1బి వీసాల జారీని కఠినతరం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, భారతీయ ఐటి పరిశ్రమ, ఐటి నిపుణులు పెద్ద ఎత్తున అవకాశాలను కోల్పోనున్నారు. ట్రంప్ బాటలోనే బ్రిటన్, ఆస్ట్రేలియా కూడా వీసాల నియంత్రణకు నిర్ణయం తీసుకోవడం దేశీ ఐటీ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేయనుంది. రానున్న రోజుల్లో ఐటీ కంపెనీల్లో లేఆఫ్‌లు తప్పవని, కొత్త ఉద్యోగ నియామకాల విషయంలోనూ నిరాశే ఉటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
గత కొద్ది నెలల కాలంలో డాలర్ మారకంలో రుపాయి విలువ 5 శాతం పెరిగింది. దీనివల్ల ఐటి కంపెనీల నికర రాబడి తగ్గుతుంది. తాజా పరిణామాలు ప్రభుత్వంలోనూ, పరిశ్రమవర్గాల్లోనూ తీవ్ర కలవరం సృష్టిస్తున్నాయి. అమెరికా జారీ చేసే హెచ్1బి వీసాల్లో 86 శాతం ప్రస్తుతం భారతీయులకే లభిస్తుండగా కొత్త విధానాల వల్ల 50-60 శాతం కంటే ఎక్కువ వీసాలు భారతీయులకు లభించకపోవచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు లాటరీ సిస్టమ్‌లో హెచ్1బి వీసాలను కేటాయిస్తుండగా ఇకపై ప్రతి వీసాను మెరిట్ ప్రాతిపదికన మాత్రమే జారీ చేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది.
అమెరికా హైటెక్ రంగం మాత్రం ట్రంప్ విధానాలను ఆహ్వానిస్తోంది. దేశీయ ఆర్థిక రంగంలో అత్యంత కీలకమైన శక్తిగా ఎదిగిన ఐటి రంగానికి ఎదురవుతున్న సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ఐటి పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉన్నతస్థాయి సంస్థలు సమన్వయంతో వ్యూహాత్మకంగా ముందడుగువేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
