జిన్‌పింగ్‌తో డొనాల్డ్ ట్రంప్ భేటీ
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, షీ జిన్‌పింగ్ తొలిసారిగా సమావేశమయ్యారు. వాణిజ్యం, ఉత్తర కొరియా దుందుడుకు వైఖరి, ఇతర అంశాల్లో అమెరికా, చైనా, మధ్య తీవ్రస్థాయి విభేదాలు నెలకొన్న తరుణంలో ఫ్లోరిడాలో ట్రంప్‌కు చెందిన రిసార్టులో ఈ భేటీ జరిగింది. చైనా -అమెరికా సంబంధాలను పెంచుకోవడానికి వెయ్యి కారణాలు ఉన్నాయని, తెంచుకోవడానికి ఒక్కటంటే ఒక్కటీ లేదని ట్రంప్‌తో జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. అమెరికా, చైనా బంధంతో బలోపేతమైతే అది మొత్తం ప్రపంచానికే మేలు చేస్తుందన్నారు. ద్వైపాక్షిక సంబందాలు సరికొత్త మలుపు తీసుకొనేలా ట్రంప్‌తో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమని చెప్పారు. ప్రధానమైన అంతర్జాతీయ, ప్రాంతీయ వ్యవహారాల్లో రెండు దేశాలు సంప్రదింపులు, సమన్వయం పెంచుకోవాల్సి ఉంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం, సీమాంతర నేరాల నియంత్రణ లాంటి అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో పరస్పరం సహకరించుకోవాలి అని ప్రతిపాదించారు. ఈ సమావేశం తర్వాత జిన్‌పింగ్‌తో కలిసి ట్రంప్ మీడియా ముందుకు వచ్చారు.
