Usttad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సీసాలో ‘గబ్బర్ సింగ్’ మధుపానం
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : మైత్రి మూవీ మేకర్స్,
తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా, పార్థిబన్, గౌతమీ, రామ్కీ, ఎల్.బి. శ్రీరామ్, అశుతోష్ రాణా,
నవాబ్ షా, చమ్మక్ చంద్ర, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, నర్రా శ్రీను, నాగ మహేష్, రెడిన్ కింగ్స్లే, టెంపర్ వంశీ తదితరులు నటించారు.
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, నేపథ్య సంగీతం: ఎస్. తమన్
కూర్పు: కార్తిక శ్రీనివాస్, కళ: ఆనంద్ సాయి
ఫైట్స్: రామ్–లక్ష్మణ్, నబకాంత్, పృథ్వీ
కథనం: కె. దశరథ్, రమేష్ రెడ్డి
రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, చంద్ర మోహన్; సీఈఓ: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు: ఆర్. చంద్రశేఖర్, దినేష్ నరసింహన్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్
విడుదల తేది :19.03.2026
నిడివి : 2 ఘంటల 34 నిమిషాలు
‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,(Pawan Kalyan) హరీష్ శంకర్ (Harish Shankar)కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagath Singh) సినిమాపై విడుదలకు ముందు రోజురోజుకు అంచనాలు పెంచుతూవస్తుంది. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి పాట, టీజర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. దీనికి తోడు ఇటివల జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ కావడంతో మరింత బజ్ క్రియేట్ చేస్తుంది. కాగా ఉగాది పండగ సందర్భంగా నేడు మార్చ్19న ఉదయం నుండి థియేటర్ లలో ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉన్నాడో? అభిమానులను, ప్రేక్షకులను ఈ మేరకు ఆకట్టుకున్నాడో సమీక్షలో చూద్దాం.
కథ :
ఆదివాసి ప్రాంతాల్లో పిల్లల సంక్షేమం కోసం కృషి చేసే ఓ గొప్ప గురువు అయిన ఆ ఊరి మాస్టర్ చంద్రశేఖర్ రావు(కె.ఎస్. రవికుమార్) చిన్నయ్యగా పిలవబడే అనాథని దత్తత తీసుకొని చదివిస్తారు. ఆ పసివాడు ఏసీపీ ఉస్తాద్ భగత్ సింగ్ (పవన్ కళ్యాణ్) ఉస్తాద్ భగత్ సింగ్, అంటే భగత్, తరువాత ఒక పోలీస్ అధికారిగా చెడు శక్తులపై పోరాడతాడు. ఇదే సమయంలో అతని గురువు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవతరిస్తాడు. అన్నీ సవ్యంగా సాగుతున్న సమయంలో, కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రిని హత్య చేయడానికి ప్రయత్నిస్తారు. భగత్ తన నిజాయితీ, నిష్ఠ కారణంగా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? ఆ గుంపు ముఖ్యమంత్రిని ఎందుకు హత్య చేయాలని ప్రయత్నించింది? రేడియో జాకీగా పనిచేసే లీల (శ్రీలీల)తో(Sri Leela) భగత్‌కు ఉన్న సంబంధం ఏమిటి? శ్లోక (రాశి ఖన్నా)(Rasi Khanna) ఎవరు? ఆమెకు భగత్‌తో ఉన్న సంబంధం ఏమిటి? భగత్, అవినీతి రాజకీయ నాయకుడు చడల మార్రి నల్ల నాగప్ప (ఆర్. పార్థిబన్) మరియు అతని కుమారులతో ఎలా పోరాడాడు? ఇవే మిగతా కథ సినిమా లో చూడాలి.
నటీ నటుల హావబావలు:
మొదటగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్, స్టైలింగ్ ఇటీవలి కాలంలో ఆయన చేసిన సినిమాల్లో అత్యుత్తమంగా నిలిచింది. ఒక పాటలో ఆయన డ్యాన్స్ బాగా చేశారు. కొన్ని సన్నివేశాల్లో తన కామెడీ టైమింగ్‌ను మళ్లీ గుర్తు చేశారు. ప్రీ-క్లైమాక్స్‌లోని భావోద్వేగ సన్నివేశంలో కూడా అద్భుతంగా నటించారు. అలాగే ప్రతినాయకులతో ఎదురెదురుగా వచ్చే సన్నివేశాల్లో తన ప్రత్యేక శైలిలో ప్రేక్షకులను అలరించారు. సీనియర్ దర్శకుడు మరియు నటుడు ఆర్. పార్థిబన్ అవినీతి రాజకీయ నాయకుడి పాత్రలో మంచి నటన కనబరిచారు. ఆయన పాత్ర మరింత భయానకంగా కనిపించడంతో పాటు తన నటనతో ఆకట్టుకున్నారు. మరో సీనియర్ దర్శకుడు మరియు నటుడు కె.ఎస్. రవికుమార్ కీలక పాత్రలో కనిపించి మంచి ప్రదర్శన ఇచ్చారు. సాధారణంగా ఆయన కామెడీకి అవకాశం ఉన్న పాత్రల్లో కనిపిస్తారు కానీ ఈ సినిమాలో గురువుగా మొదలై ముఖ్యమంత్రిగా మారే పాత్రలో ఆయన పరిపక్వమైన నటనను చూపించారు.
రేడియో జాకీగా, చురుకైన అమ్మాయిగా శ్రీలీల తన పాత్రను చక్కగా పోషించింది. పవన్ కళ్యాణ్‌కు జోడీగా ఆమె ఎంపికైనప్పుడు కొందరికి ఈ జోడీ తెరపై ఎలా కనిపిస్తుందో అనే సందేహం ఉన్నప్పటికీ, దర్శకుడు హరీష్ శంకర్ వారి మధ్య సన్నివేశాలను చక్కగా తీర్చిదిద్దడంతో వారి కెమిస్ట్రీ సహజంగా కనిపించింది. రాశి ఖన్నా పాత్రకు అంత ప్రాధాన్యం లేకపోయినా, ఆమె తన ఉనికిని తెలియజేసింది. అయితే నటన పరంగా ఆమెకు ఎక్కువ ఛాన్స్‌ల లేదు. సీనియర్ నటుడు రామ్కీ మరియు సీనియర్ నటి గౌతమి చిన్న పాత్రల్లో కనిపించి తమ ఉనికిని చాటుకున్నారు. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎల్.బి. శ్రీరామ్ కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కనిపించి అతిశయోక్తి లేకుండా మంచి నటనను ప్రదర్శించారు. రావు రమేష్ ఒక కీలక పాత్రలో ట్విస్ట్‌తో కనిపించారు. అయితే ప్రారంభ భాగాల్లో ఆయన నటన కొంత అతిగా అనిపించి కొన్ని సందర్భాల్లో విసుగును కలిగించింది. సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, చమ్మక్ చంద్ర తదితరులు కామెడీ సన్నివేశాలతో నవ్వులు పంచేందుకు ప్రయత్నించినప్పటికీ సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు.
సాంకేతిక వర్గం పనితీరు:
దేవిశ్రీప్రసాద్ (Devisri Prasad)ఇచ్చిన సాంగ్స్ బాగున్నాయి. థమన్ (Thaman S)బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఒకే అని చెప్పొచ్చు. అయనక బోస్ సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా ఓకే అనిపిస్తుంది. ఇక దర్శకుడు హరీష్ శంకర్ విషయానికి వస్తే.. గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా తనపై ఆ ఒత్తిడి ఉంటుంది. అయితే దీనిని చాలా వరకు తను బాగానే హ్యాండిల్ చేసే ప్రయత్నం చేశారు. రీమేక్ అనే నెగిటివిటీ నుంచి మొదటి బ్లేజ్ తోనే సమాధానం అందించారు. కానీ తనపై ఆ ఎఫెక్ట్ మాత్రం అలా కొనసాగుతూనే వచ్చింది. ఆ కామెంట్స్ కి ఉస్తాద్ తో ఒక మంచి సమాధానం ఇచ్చారని చెప్పొచ్చు. కానీ వీరి కలయిక అంటే ఇంకా ఎక్కువ ఆశలు, అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ప్రెజెంట్ చేసే తీరుని ఇంకా ఎంగేజింగ్ గా డిజైన్ చేసుకొని ఉంటే బాగుండేది. బహుశా మళ్లీ గబ్బర్ సింగ్ లానే చూపించారు అనే కామెంట్స్ వస్తాయని అనుకోని ఉండొచ్చు కానీ తన మెదడుకి మరింత పదును పెట్టి పవన్ ని ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేయాల్సింది. తనకి ఉన్న శక్తి, పరిధిలో మాత్రం పవన్ ఇచ్చిన డేట్స్ లో మంచి అవుట్ పుట్ రాబట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సెకండాఫ్ హ్యాండిల్ చేసిన తీరు బాగుంది. తన మార్కు మాటలు, తూటాల్లా ఇందులో పేలాయి. కానీ ఇంకా బలమైన కథ, కథనాలు ఇందులో అవసరం ఉంది. ఇవి కూడా పర్ఫెక్ట్ గా సెట్ చేసుకుంటే బాగుండేది. ఈ చిత్రానికి నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) ఖర్చు బాగా తెలుస్తోంది. గ్రాండ్ సెట్స్, రియల్ లొకేషన్స్ లో షూట్స్ బాగా ప్లాన్ చేసుకున్నారు.
విశ్లేషణ :
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రకటించినప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా 2020లో ప్రకటించబడినప్పటికీ… 2024 లో షూటింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇది తమిళ చిత్రం ‘తేరి’ రీమేక్ అన్న ప్రచారం ఎక్కువగా వినిపించింది. అయితే, ఈ చిత్రం నేరుగా రీమేక్ కాకపోయినా, కథా నిర్మాణం, సన్నివేశాల రూపకల్పనలో గత తెలుగు కమర్షియల్ సినిమాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కమర్షియల్ ఎంటర్టైనర్లకు కథ కొత్తగా ఉండకపోయినా, ప్రదర్శనలో కొత్తదనం వుండాలి. ఈ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్, స్క్రీన్‌ప్లే రచయిత దశరథ్ రెండో భాగంలో కొన్ని మెరుగైన ఎపిసోడ్లు అందించినప్పటికీ, మొత్తం సినిమాను అదే స్థాయిలో నడిపించలేకపోయారు. ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో ఏర్పడిన అంచనాలు ఈ సినిమాపై స్పష్టంగా ప్రభావం చూపించాయి. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ప్రత్యేకత, ఒరిజినాలిటీ ప్రధాన బలం కాగా, ఇక్కడ మాత్రం హీరో క్యారెక్టర్ ఆయన నిజ జీవిత వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండటం, పాత సినిమాల రిఫరెన్స్లపై ఆధారపడటం కొంత నెగెటివ్‌గా మారింది. ‘వింటేజ్ పవన్ కళ్యాణ్’ను రీక్రియేట్ చేయాలన్న ప్రయత్నం ఎక్కువగా కనిపిస్తుంది.
అయితే, రెండో భాగంలో మూడు ముఖ్యమైన సన్నివేశాలు సినిమాకు బలం చేకూర్చాయి. ఓల్డ్ సిటీ ఎపిసోడ్, పోలీస్ స్టేషన్ సీక్వెన్స్, విలన్ కుమారుడితో సంబంధం ఉన్న కీలక ఘట్టం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇవి ముఖ్యంగా అభిమానులకు మెప్పిస్తాయి. హరీష్ శంకర్ రాసిన సంభాషణలు సినిమాకు మరో ప్లస్ పాయింట్. “గాంధీ గారు అంటే గౌరవం… భగత్ సింగ్ అంటే ప్రాణం”, “ఆస్తులు అందరూ పోగేసుకుంటారు… ఆశీర్వాదాలు మాత్రం కొందరే పోగేసుకుంటారు”, “భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు… యుద్ధాన్ని మధ్యలో ఆపమని చెప్పలేదు” లాంటి డైలాగ్స్ బాగా పనిచేశాయి. సామాజిక సందేశాన్ని కలగలిపిన పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాగే, కొత్త పాటకు బదులుగా ‘తొలిప్రేమ’ చిత్రంలోని ‘నీ మనసే’ పాటను ఉపయోగించడం ఒక ఆసక్తికరమైన ఎంపికగా నిలిచింది. మొత్తంగా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక ఫార్ములా ఆధారిత కమర్షియల్ ఎంటర్టైనర్గా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్ తన పాత్రలో మెప్పించినప్పటికీ, సినిమా మొత్తం స్థాయిలో మాత్రం ‘గబ్బర్ సింగ్’కు సమానంగా నిలవలేదు. అభిమానులకు ఇది ఒకసారి చూడదగ్గ సినిమా కాగా, మిగతా ప్రేక్షకులు తమ అభిరుచిని బట్టి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
