Shasti Poorthi Review: ఏప్రిల్1 విడుదల సినిమాకు వ్యతిరేకంగా ‘షష్టి పూర్తి’కథ

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్త: మా ఆయి ప్రొడక్షన్స్
నటినటులు : రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్షా సింగ్ , ‘కాంతార’ ఫేమ్ అచ్యుత్ కుమార్, సంజయ్ స్వరూప్, తెనాలి శకుంతల, ఆనంద చక్రపాణి, రాజ్ తిరందాసు, మురళీధర్ గౌడ్, ‘చలాకి’ చంటి, ‘బలగం’ సంజయ్, అనుపమ స్వాతి, రుహీనా, అనిల్, కెఏ పాల్ రాము, మహి రెడ్డి, శ్వేతా, లత, ప్రవీణ్ కుమార్, శ్రీధర్ రెడ్డి, అంబరీష్ అప్పాజీ తదితరులు
సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, సినిమాటోగ్రఫీ : రామ్ రెడ్డి,
ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి, పాటలు :యం యం కీరవాణి, చైతన్య ప్రసాద్,
కొరియోగ్రఫీ: స్వర్ణ మాస్టర్,నిక్సన్ మాస్టర్,
ప్రొడక్షన్ కంట్రోలర్: బిఎస్ నాగిరెడ్డి
కో డైరెక్టర్: సూర్య ఇంజమూరి
నిర్మాత: రూపేష్,
స్క్రీన్ ప్లే- సంభాషణలు- దర్శకత్వం : పవన్ ప్రభ
విడుదల తేది : 30.05.2025
ఇటివల విడుదల కానున్న చిత్రాలలో షష్టిపూర్తి సినిమాపై ఫోకస్ పడడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి.. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించడం. రెండోది ‘లేడీస్ టైలర్’ జంట రాజేంద్ర ప్రసాద్,(Rajendra Prasad) రెండు సార్లు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్న నటి అర్చన (Archana)దాదాపు 38 ఏళ్ల తరవాత కలసి నటించిన సినిమా ఇది. పైగా… అచ్చ తెలుగు టైటిల్. దాంతో ఈ సినిమా ఎలా ఉంటుందా? అనే ఆసక్తి మొదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇళయరాజా పాటల కోసం, రాజేంద్ర ప్రసాద్ నటన కోసం, అర్చన రీ ఎంట్రీ కోసం ఈ సినిమా చూడొచ్చా? అన్నది సమీక్షలో చూద్దాం!
నీతి, నిజాయితీతోపాటు ప్రొఫెషనల్ విలువలను పాటించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీరామ్ ( రూపేష్ చౌదరీ)(Rupeesh Kumar Choudary) తల్లిదండ్రులకు దూరంగా ఒంటరిగా ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. నియమ నిబంధనలు స్ట్రిక్ట్‌గా పాటించే రూపేష్‌కు కాలనీలో అందరూ దూరంగా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఓ క్లిష్టమైన సమస్యలో ఇరుక్కొన్న జానకీ (ఆకాంక్ష సింగ్)(Aknaksha Singh) శ్రీరామ్‌కు తారసపడి అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. జానకీని తొలిచూపులోనే ప్రేమించడమే కాకుండా పెళ్లి కూడా చేసుకోవాలని అనుకొంటాడు. కానీ నీతి, నిజాయితీల వల్ల ఒరిగేదేం ఉండదని, లౌక్యంగా బతకాలని, అబద్ధాలు చెప్పడం తప్పు కాదని, అలా ఉంటేనే పెళ్లి చేసుకొంటానని కండీషన్ పెడుతుంది ఇలాంటి పరిస్థితుల్లోనే తల్లిదండ్రులు దివాకర్ (రాజేంద్ర ప్రసాద్), భువనేశ్వరి (అర్చన) విడిపోవాలని నిర్ణయించుకొంటారు. తల్లిదండ్రులకు దూరంగా శ్రీరామ్ ఎందుకు ఒంటరిగా ఉంటాడు? నిజాలు మాట్లాడే శ్రీరామ్‌ను కాలనీవాసులు ఎందుకు దూరం పెడుతారు? పెళ్లి చేసుకొనే సమయంలో శ్రీరామ్‌ను జానకీ ఎందుకు అబద్దాలు ఆడాలని కండిషన్ పెడుతుంది? అబద్దాలు ఆడితే శ్రీరామ్‌కు ఎదురైన పరిస్థితులు ఏమిటి? శ్రీరామ్‌ను తల్లి ఎందుకు ఈసడించుకొంటుంది? భర్త దివాకర్ నుంచి భువనేశ్వరి ఎందుకు విడాకులు తీసుకోవాలనుకొంటుంది? విడిపోవాలని అనుకొన్న తల్లిదండ్రులను శ్రీరామ్ కలిపాడా? వారిద్దరి షష్టిపూర్తి జరిపించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే షష్టిపూర్తి సినిమా కథ.
నటీనటుల హవబావాలు :
రాజేంద్ర ప్రసాద్, అర్చన ఈ సినిమాకు బిగ్ అసెట్. వాళ్ళ నటన చాతుర్యం గురించి వేరే చెప్పాలా? వయసుకు తగ్గ పాత్రలలో జీవించారు. వాళ్ళిద్దరిని 30 ఏళ్ల వయసులో చూపించినప్పుడు మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఇక షష్టిపూర్తి సినిమా భారాన్నంత నూతన నటుడు రూపేష్ మాగ్జిమమ్ తన భుజాలపై మోశాడు. ఫస్ట్ టైమ్ హీరో అనే ఫీలింగ్ ఎక్కడా కనిపించలేదు. ఎన్నో సినిమాలు చేసిన నటుడిగా అనిపించాడు. హీరోగా నిర్మాతగా తన ఫాషన్ కనపర్చారు. ఆకాంక్ష సింగ్ అందాల ఆరబోతనే కాకుండా పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నది. ఆనంద చక్రపాణి తన మార్కు నటనను ప్రదర్శించాడు. కథను మలుపుతిప్పే పాత్రలో ఆయన గుర్తుండిపోతారు. ‘కాంతార’ ఫేమ్ అచ్యుత్ కుమార్, సంజయ్ స్వరూప్, తెనాలి శకుంతల, ఆనంద చక్రపాణి, రాజ్ తిరందాసు, మురళీధర్ గౌడ్, ‘చలాకి’ చంటి, ‘బలగం’ సంజయ్, అనుపమ స్వాతి, రుహీనా, అనిల్, కెఏ పాల్ రాము, మహి రెడ్డి, శ్వేతా, లత, ప్రవీణ్ కుమార్, శ్రీధర్ రెడ్డి, అంబరీష్ అప్పాజీ వంటి ఇంత మంది నటులను సరిగా ఉపయోగించుకోలేకపోయారేంటి? అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం పనితీరు:
ఈ సినిమాకి ‘షష్టిపూర్తి’ అనే పేరు ఎందుకు పెట్టారన్నది అంతుచిక్కని ప్రశ్న. అసలు ఈ పేరుకీ, కథకీ సంబంధమే ఉండదు. చివర్లో టైటిల్ జస్టిఫికేషన్ కోసం అమ్మానాన్నలతో షష్టిపూర్తి చేయించారు. మధ్యలో ఓ ప్రవచనంలో షష్టిపూర్తి ప్రాధాన్యత వినిపించారు. అంతే. షష్టిపూర్తి, అమ్మానాన్నల కథ.. అనుకొని థియేటర్లలోకి వెళ్తే.. దర్శకుడు పవన్ ప్రభ (Pawan Prabha) వేరే కథ చూపించే ప్రయత్నం చేశాడు. అమ్మానాన్నల కథ ఎక్కడో శుభం కార్డుకు ముందు వస్తుంది. ఆ కథ కూడా చప్పగానే ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్, అర్చనల మధ్య ‘ముదురు’ ప్రేమకథ చూడడానికి చాలా ఓపిక కావాలి. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో ఏదో గొప్ప లవ్ స్టోరీ ఉంటుందనుకొంటే, అక్కడ కూడా సందేశాలతో కాలక్షేపం చేశాడు దర్శకుడు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఆయన స్టైల్ మూడు పాటల్లో కనిపించింది.. వినిపించింది. పాటలు వింటుంటే ఇళయరాజా పాత పాటలే మళ్లీ గుర్తొస్తాయి. బహుశా చిత్రబృందం కూడా ఇళయరాజా నుంచి అదే ఆశించి ఆయన్ని గౌరవిన్చారనిపిస్తుంది. బ్యాగ్ గ్రౌండ్ స్కోర్‌లో మాత్రం మాస్ట్రోలో మ్యాజిక్ కనిపించలేదు. గ్రామీణ వాతావరణాన్నీ, గోదావరి నదీ తీరం అందాలను రామ్ రెడ్డి కెమెరాలో అద్బుతంగా బంధించాడు. ఎడిటింగ్ పరంగా కార్తీక్ శ్రీనివాస్ నిరాశపరిచాడు. మా ఆయి ప్రొడక్షన్ బ్యానర్ అందించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. సినిమాలోని ప్రతీ ఫ్రేమ్ ఓ పెయింటింగ్‌లా, రిచ్‌గా కనిపించాయి. రూపేష్ నిర్మాణంలో క్వాలిటీ ఉంది ఎక్కడా కంపార్మైజ్ కాలేదు.
విశ్లేషణ :
‘ఏప్రిల్ 1 విడుదల’లో హీరోయిన్ కండీషన్ పెట్టడానికి బలమైన కారణం ఉంటుంది. దానికి ముందూ, వెనుక మంచి డ్రామా ఉంది. తాను చెప్పే నిజాల వల్ల కొంపలు కొల్లేరవుతాయి. చివరికి హీరో పీకల మీదకు వస్తుంది. అదంతా ఫన్‌తో నడించాడు వంశీ. ఇక్కడ ఆ డ్రామా, ఆ ఫన్ మిస్ అయ్యింది. హీరో నిజాలు చెప్పినా, అబద్ధాలు చెప్పినా పెద్ద తేడా ఉండదు. హీరోయిన్ ఇలా కండీషన్ పెట్టడానికి కూడా పెద్దగా కారణం కనిపించదు. అయితే ప్రస్తుతం మితీమీరిన హింస, హారర్, అడల్డ్ కంటెంట్‌తో వస్తున్న సినిమాల మధ్య క్లీన్ చిత్రం షష్టిపూర్తి. రాజేంద్రప్రసాద్, అర్చన నటన, ఇళయరాజా, తోటతరణి పనితనం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఎడిటింగ్, బలమైన సన్నివేశాలు, ఎమోషన్స్ పూర్తిగా పండకపోవడం మైనస్‌గా అనిపిస్తాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేయడానికి చాలా అంశాలు ఉన్నాయి. ఈ సినిమాను ఓసారి చూడొచ్చు. ఫ్యామిలీ కంటెంట్ సినిమాలు చూడాలనుకొనే వారికి షష్టిపూర్తి ఓ మంచి చిత్రంగా అవుతుంది.