Jamaica: గుంటూరు వైద్యుడికి జమైకాలో అరుదైన గౌరవం

ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యుడు చందోలు నాగమల్లేశ్వరరావు ( Nagamalleshwara Rao) కు జమైకా (Jamaica) లో అరుదైన గౌరవం దక్కింది. అక్టోబరు 20న జమైకా నేషనల్ హీరోస్ డే సందర్భంగా ఆ దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ఆర్డర్ ఆఫ్ డిస్టింక్షన్ (ఆఫీసర్ ర్యాంకు- ఓడీ) అవార్డును జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ ప్రదానం చేశారు. అతి తక్కువ ఫీజులకే అక్కడ వైద్యం చేస్తుండటంతో నాగమల్లేశ్వరావు ఫైవ్ బిల్స్ డాక్టర్ (Doctor)గా పేరుపొందారు. ఈ అవార్డు వచ్చిన నేపథ్యంలో కింగ్‌స్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ఆయనకు అభినందనలు తెలిపింది. బాపట్లజిల్లా నగరం మండలం బెల్లంవారిపాలేనికి చెందిన నాగమల్లేశ్వరరావుది సామాన్య కుటుంబ. తండ్రి రిక్షా తొక్కేవారు. తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనా పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. చిలకలూరిపేట మండలం మద్దిరాల నవోదంలో ఇంటర్మీడియట్ వరకు చదివిన నాగమళ్లేశ్వరరావు, ఎన్టీఆర్ (NTR) ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి వైద్యవిద్య పూర్తి చేశారు. 2005లో జమైకా వెళ్లి ఆయన పేదల వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. చందోలు గ్లోబల్ హెల్త్‌కేర్ ప్రాక్టీస్ పేరిట ఓ సంస్థను స్థాపించి వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు ఆ దేశంలోని అతి తక్కువ కన్సల్టేషన్ ఫీజు తీసుకుంటున్న వైద్యుడిగా గుర్తింపు పొందారు.