OG Review: ప్యూర్ ఫ్యాన్ మేడ్ మూవీ ‘ఓ జీ’

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3.25/5
నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
తారాగణం: పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియారెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, సుదేవ్ నాయర్, తేజ్ సప్రూ, సత్యప్రకాష్, అభిమన్యు సింగ్, ‘కిక్’ శ్యామ్, శుభలేఖ సుధాకర్, రాహుల్ రవీంద్రన్, అజయ్ ఘోష్, జీవా, ‘యానిమల్’ ఫేమ్ ఉపేంద్ర లిమయే, సుహాస్, శ్రీకాంత్ అయ్యంగార్, సమ్మెట గాంధీ, అతిధి పాత్రలో సుహాస్ తదితరులు నటించారు
సంగీతం: తమన్ ఎస్; ఛాయాగ్రహణం: రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస
కూర్పు: నవీన్ నూలి; నిర్మాతలు: డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి
దర్శకత్వం: సుజీత్
విడుదల తేది : 25.09.2025
నిడివి : 2 ఘంటల 34 నిముషాలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నిరీక్షణకు తెరపడింది. అభిమానులు, ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’ ఈ రోజు విడుదలైంది. దర్శకుడు సుజీత్(Director Sujeeth) ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫానుగా మలిచారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య,(DVV Danayya) కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ‘హంగ్రీ చీతా’ పేరుతో సెప్టెంబర్ 2న విడుదల చేయగా, ప్రీ-రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 21న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీ లెవల్లో నిర్వహించారు. ట్రైలర్‌ను సెప్టెంబర్ 22న విడుదల చేయడంతో అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. మరి ఈ అంచనాలకు పవన్ కళ్యాణ్ రీచ్ అయ్యాడా? లేదా సమీక్షలో చూద్దాం.
కథ :
1970-1990 మధ్య సమయంలో కథ నడుస్తుంది. ముంబై దాదా అయినటువంటి సత్య దాదా (ప్రకాష్ రాజ్)(Prakash Raj) ముంబై పోర్ట్ ని నడుపుతూ ఉంటాడు. అతనికి అండగా ఓజాస్ గంభీర (పవన్ కళ్యాణ్) అండగా ఉంటాడు. కానీ ఓ కారణం చేత ఓజాస్ గంభీర, అతని భార్య కన్మణి (ప్రియాంక ఆరుళ్ మోహన్) (Priyanka Arul Mohan)అజ్ఞాతం లో వుండి సత్య దాదా నుంచి దూరం కావాల్సి వస్తుంది. అక్కడ నుంచి ఆ పోర్ట్ పై చాలా మంది కన్ను పడుతుంది. సత్య దాదా పార్టనర్ మిరాజ్ ఖర్ (తేజ్ సఫ్రు) (Tej Safru)అతని కొడుకులు జిమ్మీ (సుదేవ్ నాయర్) (Sudev Nair)ఓమిగా పిలవబడే ఓంకార్ వర్ధమాన్ (హిమ్రాన్ హస్మి) (Himraan Hasmi)తమ గుప్పెట్లో పెట్టుకునేదుకు ప్రయత్నిస్తారు. అయితే ఆ పోర్ట్ లో ఒక RDX కంటైనర్ మిస్ అయ్యిందన్న నేపధ్యంలో సత్య దాదా పార్టనర్ కొడుకు ఓంకార్ వర్ధమాన్ సత్య దాదా కుమారుడిని చంపేస్తాడు. గంభీర ఎందుకు సత్య దాదాకి దూరం అయ్యాడు? అసలు ఇద్దరికీ లింక్ ఎలా కుదిరింది? ఇంకోపక్క అర్జున్ (అర్జున్ దాస్) గంభీరని ఎందుకు చంపాలి అనుకుంటాడు. ఓమి తాలూకా RDX కంటైనర్లు సత్య దాదా పోర్ట్ వచ్చాక ఏమయ్యాయి? ఈ కథలో శ్రీయ రెడ్డి పాత్ర ఏమిటి? ఈ మధ్యలో గంభీర కోల్పోయింది ఏంటి? అసలు ఈ గంభీర ఎవరు? అతని గతం ఏంటి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్స్ లో చూడాల్సిందే.
నటీ నటుల హవబవాలు :
ఈ సినిమాలో విచిత్రమేమిటంటే? ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్. రియల్ లైఫ్‌లో పవన్ కళ్యాణ్ అంటే ప్రకాష్ రాజ్ కు అస్సలుగిట్టదు. అలాంటి ఆయన నోటితోనే పవన్ కళ్యాణ్‌కి ఎలివేషన్స్ ఇప్పించాడయ్యా సుజీతూ.. మామూలుగా ఉండవు ఆ ఎలివేషన్స్. మా హీరోని తిడతావ్ రా.. నీ నోటితోనే పొగిడిస్తా చూడూ అన్నట్టుగానే ఉంటాయి ప్రకాష్ రాజ్ నోట నుంచి వచ్చే ఆ హైఓల్టేజ్ ఎలివేషన్ సీన్లు. ఏమాటకామాటే కానీ.. సత్యదాదాగా ప్రకాష్ రాజ్.. సినిమాకి కీలకం అయ్యారు. పవన్, ప్రకాష్ రాజ్ కాంబినేషన్ సీన్లు చాలా ఎమోషనల్‌గా అనిపించాయి. ఆఫ్ స్క్రీన్‌లో బద్దశత్రువులుగా ఉండే వీళ్లిద్దరూ..ఎలాంటి ఇగో ఇష్యూస్ లేకుండా… ఆన్ స్క్రీన్‌కి వచ్చేసరికి అంత ఆత్మీయులు ఎలా అయిపోయారబ్బా? అనిపిస్తుంది! ఎవరికి వారే పోటి పడి నటించారు. కన్మణి పాత్ర పేరుకి తగ్గట్టుగానే ఉంది ప్రియాంక మోహన్, తన భర్తని కంటికి రెప్పలా కాపాడుకునే పాత్రకి న్యాయం చేసింది. కొత్త అమ్మాయి కావడంతో ఫ్రెష్ లుక్‌లో కనిపించింది. పవన్‌కి పెయిర్‌గా కూడా సెట్ అయ్యింది. ప్రేమ కోసం నేర ప్రవృత్తిని వదిలేశాడని చూపించారు కానీ.. ఆ ప్రేమ కథని చూపించలేదు. నేరుగా పెళ్లితో మొదలుపెట్టి.. వారికో కూతురు.. అందమైన ఫ్యామిలీగా ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చూపించారు. ప్రతినాయకుడిగా ఇమ్రాన్ హష్మీ.. గంభీరుడితో పోటీకి గట్టిగానే నిలబడ్డాడు. ఆయన్ని కూడా చాలా స్టైలిష్‌గా చూపించారు. శ్రియారెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, సుదేవ్ నాయర్, తేజ్ సప్రూ, సత్యప్రకాష్, అభిమన్యు సింగ్, ‘కిక్’ శ్యామ్, శుభలేఖ సుధాకర్, రాహుల్ రవీంద్రన్, అజయ్ ఘోష్, జీవా, ‘యానిమల్’ ఫేమ్ ఉపేంద్ర లిమయే, సుహాస్, శ్రీకాంత్ అయ్యంగార్, సమ్మెట గాంధీ ఇలా పెద్ద తారాగణమే ఉంది ఈ సినిమాలో. సుహాస్.. చాలా చిన్న రోల్‌లో కనిపించాడు.
సాంకేతికవర్గం పనితీరు :
పవన్ అభిమాని ఎవరైనా వున్నారంటే అతనికి ఖచ్చితంగా ‘జానీ’ సినిమా నచ్చుతుంది. ఇక్కడ దర్శకుడు సుజీత్ కూడా అదే కోవకు చెందినవాడు. జానీ రిఫరెన్స్‌లను భలే వాడుకున్నాడు. జానీ ఆర్ఆర్ కానీ.. గంభీరుడు గన్‌ని జానీ అని పేరు పెట్టడం కానీ.. ఖుషీ, బద్రి, తమ్ముడు రిఫెరెన్స్‌లతో పవన్ ఫ్యాన్స్‌ని పాతరోజుల్లోకి తీసుకుని వెళ్లాడు సుజీత్. పవన్ ఇమేజ్‌ని ప్రజెంట్ చేయడమే ముఖ్యమైన మోటో అనుకున్నాడో ఏమో కానీ.. కథ పరంగా కొత్తగా మెరుపులు, మలుపులు అయితే కనిపించవు. జపాన్, ముంబై, మదురై, నాసిక్ అంటూ పేరరల్ లేయర్స్‌తో కొత్తగా చెప్పే ప్రయత్నం చేసాడు. ఈ సినిమాకి బలమైన స్తంబాలు సుజీత్, పవన్ కళ్యాణ్ అయితే మూడో పిల్లర్ తమన్. (Thaman S) తన మ్యూజిక్ సెన్స్‌తో సినిమా స్థాయిని పెంచేశాడు. అతని వర్క్ చాలా సెన్స్‌బుల్‌గా అనిపిస్తుంది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్‌కి.. పోలీస్ స్టేషన్ సీన్‌కి క్లైమాక్స్‌లో ఆ పది నిమిషాల యాక్షన్ ఎపిసోడ్‌కి అదరగొట్టాడు. తమన్ తాను పని చేసిన ఏ సినిమాకి ఇంత సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేదు కానీ.. సినిమా చూశాక.. కొట్టుకోవడం తప్పులేదులే అనిపిస్తుంది. అంతమంచి ఔట్ పుట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్‌లో కొత్త రకం స్వాగ్, స్టైల్‌ని దర్శకుడు ఊహించుకోవడం దానికి అనుగుణంగా కళ్లకి కట్టే కెమెరా పనితనం రవికె చంద్రన్, మనోజ్ పరమహంస నూటికి నూరు శాతం న్యాయం చేశారు. మల్టీ లేయర్స్ ఉన్న కథని వివిధ కోణాల్లో చూపిస్తూ తమ కెమెరా పనితనంలో వేరియేషన్స్ చూపించారు. హై క్వాలిటీ ఫిల్మ్ చూస్తున్న అనుభూతిని కలిగించారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్‌తో పాటు.. ఏ విజయ్, పీటర్ హెయిన్స్, స్టంట్స్ శివల యాక్షన్ సీన్స్ హైలైట్‌గా నిలిచాయి. కొన్ని స్టంట్స్ అయితే పవన్ డూప్‌ని పెట్టినట్టుగా క్లియర్‌గా తెలిసిపోతుంటుంది. హై టెక్నికల్ వాల్యూస్ అందించడంలో నిర్మాత దానయ్య ఖర్చుకి ఏ మాత్రం వెనకాడలేదు.
విశ్లేషణ:
సుజీత్ అనబడే పవన్ కళ్యాణ్ అభిమాని.. పవన్‌పై ఉన్న అమితమైన అభిమానంతో రాసిన కథ. అందుకే తన అభిమాన హీరోని ఏ విధంగా చూడాలని కలలు కన్నాడో అదే చేశాడు. అయితే ఈ సినిమాలో కొన్ని మైనస్ లు వున్నాయి, ఓ జి గొప్ప కథకాదు. పాత కథలనే ముక్కలు ముక్కలుగా చూపించినట్టు ఉంటుంది. భయంకరమైన హింస, రక్తపాతం. పవన్ కళ్యాణ్‌కి డేట్స్ కుదర్లేదో ఏమో కానీ.. చాలా చోట్ల డూప్‌ని పెట్టి తీసేశారు. అతను డూప్ అని తెలియకుండా జాగ్రత్తపడితే బావుండేది కానీ.. చాలా సీన్లతో పవన్ గెటప్‌లో డూప్‌ని గుర్తుపట్టేయొచ్చు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో కూడా డూప్ ఇబ్బందిపెడుతూ ఉంటాడు. కొన్ని చోట్ల డబ్బింగ్ కూడా లిప్ సింక్ కుదర్లేదు. పవన్ కళ్యాణ్ నుంచి ఎంతో కాలంగా మిస్ అవుతున్న ఒక స్టైలిష్ గ్యాంగ్ స్టర్ తరహా ట్రీట్ కోసం చూస్తున్న వారికి ఓజి ఒక జంబో బిర్యానీ ప్యాక్ లాంటిది అని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ఓజి” పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సాలిడ్ ట్రీట్ అందిస్తుంది అని చెప్పాలి. సుజీత్ పవన్ కళ్యాణ్ ని ప్రెజెంట్ చేసిన విధానం క్రేజీ స్టఫ్ ని అందిస్తుంది. తన బ్యాక్ స్టోరీ కానీ తనపై ఎలివేషన్స్ కానీ యాక్షన్ సీన్స్ గాని ఫ్యాన్స్ కి ఓ రేంజ్ ట్రీట్ అందిస్తాయి. ఒక స్టైలిష్ అండ్ సాలిడ్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా చూడాలి అనుకుంటే ‘ఓజి’ ట్రీట్ ఇస్తుంది.